అమ్మాయిల పేర్లతో వల వేయటం.. మ్యాట్రిమోనీల సైట్లతో ఆడుకోవటం.. బ్యాంకుల పేరుతో ఖాతాలు ఖాళీ చేయటం.. లక్కీ డ్రాల పేరుతో ఉన్నదంతా దోచుకోవటం.. ఒక్క క్లిక్ చేస్తే చాలు కొంపలు కొల్లేరు చేసే... మోసాలెన్నో మనం తరచూ చూస్తూనే ఉన్నాం. సాఫ్ట్వేర్లు అప్డేట్ అయినట్టు... ఈ సైబర్ నేరాగాళ్లు కూడా ఎప్పటికప్పుడు తమ పంథాను మార్చుకుంటున్నారు. ఎవరూ ఊహించని విధంగా అమాయకులను దోచుకుంటూనే ఉన్నారు.
ఈసారి మందుబాబుల వంతు..
సామాన్యుల ఆశనే అవకాశంగా... అవసరాలనే ఆసరాగా చేసుకుని.. వారి చావు తెలివితేటలతో నిలువుగా ముంచేస్తున్నారు. అన్ని రకాలుగా ప్రయత్నించి దొరికిపోతున్నామనుకున్నారో.. లేదా కొత్తగా ట్రై చేద్దామనుకున్నారో.. లేక వీళ్లనెందుకు వదిలిపెట్టాలనుకున్నారో.. ఇప్పుడు మందుబాబులపై పడ్డారు. "వైన్స్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. కావాల్సినంత మందు మీ ముందు పెట్టే బాధ్యత మాది" అంటూ.. మందుప్రియులకు సైబర్ నేరగాళ్లు సరికొత్త మత్తు వల వేశారు.
హోండెలివరీ కూడా ఫ్రీ అంటా..
మందుబాబులకు హోండెలివరీ పేరుతో తెలివిగా విసిరే సైబర్ కేటుగాళ్ల ఉచ్చుకు ఎందరో మందుబాబులు చిక్కుతున్నారు. పరువు పోతుందనే బాధతో ఎవరూ బయటకు రావడం లేదు. ధైర్యం చేసి ఓ బాధితుడు... సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం వల్ల ఈ నయా మోసం వెలుగులోకి వచ్చింది. మియాపూర్‌లో నివాసముండే బాధితుడు ఇటీవల ఆన్లైన్లో మద్యం కొనుగోలు చేసేందుకు గూగుల్‌లో వెతికాడు. పలు వెబ్సైట్లు కనిపించాయి. కొన్నింటిలో ఆఫర్లు కూడా ఉన్నాయండోయ్. మరికొన్నింటిలోనేమో హోండెలివరీ పూర్తిగా ఉచితమని టెంప్టింగ్ ఆఫర్ కనిపించింది.
బీర్లు తాగేలోపు రీఫండ్ అని..
బయటకు వెళ్లే పని లేదు. పైగా డెలివరీ ఛార్జులు కూడా లేవు. ఇంకేముంది.. వెంటనే లింక్ ఓపెన్ చేసి అక్కడున్న కస్టమర్ కేర్‌కు కాల్ చేశాడు మన బాధితుడు. అవతలివైపు వ్యక్తి ఆర్డర్ తీసుకుని రూ.300 బిల్ అయ్యిందని చెప్పాడు. డబ్బులు ముందు చెల్లిస్తే.. గంటలోపు ఆర్డర్‌ను ఇంటికి తెచ్చి ఇస్తామని స్పష్టం చేశాడు. ముందేంటి.. వెనకేంటి.. ఇప్పుడే పంపిస్తా అన్నాడు. వెంటనే ఓ లింకును పంపించారు. అక్కడి క్లిక్ చేస్తే వచ్చే క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి.. డబ్బులు కట్టాలని సూచించారు. బాధితుడు ప్రయత్నించగా.. 'టెక్నికల్ ఎర్రర్' అని వచ్చింది. ఇదే విషయం వాళ్లకు చెబితే.. మరో రెండు సార్లు లింకును పంపించారు. ఈ లింకును క్లిక్ చేసి వివరాలు నమోదు చేసిన ప్రతిసారి డబ్బులు డెబిట్ అయ్యాయి. నాలుగోసారి కూడా లింకును పంపించారు. కానీ అప్పటికే.. బాధితుడి ఖాతా ఖాళీ అయింది. రూ.2532 కట్ అయినట్లు మేసేజ్ రావడంతో బాధితుడు కంగుతిన్నాడు. మళ్లీ అదే నెంబర్‌కు కాల్ చేసి ఆరా తీస్తే.. "మీరు బీర్లు తాగేలోపు.. మీ డబ్బులు మీకు రీఫండ్ అవుతాయ్.." అంటూ నమ్మబలికారు. రాత్రి వరకు వేచి చూసినా.. అటు బీర్లు డెలివరీ కాలేదు.. ఇటు డబ్బులూ రీఫండ్ కాలేదు.
భారీగానే బాధితుల సంఖ్య
మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు.. మియాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. కేటుగాళ్లు చాలా తెలివిగా బాధితుడిని బోల్తా కొట్టించినట్లు మియాపూర్ పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రముఖ వెబ్సైట్ల పేరిట నకిలీవి రూపొందించి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు తేల్చారు. రూ. వేయి నుంచి రూ .5 వేల వరకు మోసపోయిన బాధితుల సంఖ్య భారీగా ఉంటుందని ప్రాథమికంగా నిర్ధరించారు.
సంబంధిత కథనాలు..