మీపై క్రిమినల్ కేసులున్నాయంటూ బెదిరించి ఐర్లాండ్, ఇంగ్లండ్ దేశస్థుల నుంచి రూ.లక్షలు వసూలు చేసుకున్న ఐటీ నెట్‌వర్క్ కాల్ సెంటర్(Threatening calls) తెరవెనుక వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. బేగంపేటలోని ఆ కాల్ సెంటర్ నిర్వాహకుడు ఎజాజ్‌ను రెండు వారాల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కార్యాలయంలో తనిఖీలు చేసి అక్కడ లభించిన ఆధారాల సాయంతో పరిశోధన చేస్తున్నారు.
గుజరాత్‌కు చెందిన కాఫిల్ అహ్మద్ అన్సారీ, ఎజాజ్ కొన్ని నెలల క్రితం ఈ కాల్ సెంటర్(Call center)ను ఏర్పాటు చేశారు. మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల నుంచి 20 మందిని రప్పించి, టెలీకాలర్లుగా నియమించుకొని రెండు నెలలుగా ఐర్లాండ్, ఇంగ్లండ్ దేశస్థులను బెదిరించి(Threatening calls to England traders) బిట్‌కాయిన్ల ద్వారా నగదు బదిలీ చేయించుకున్నారు. బెదిరించేందుకు ఆంగ్లంలో ఏ మాండలికం వినియోగించారన్న అంశంపై హైదరాబాద్‌లోని ఆ దేశస్థులతో పోలీసులు మాట్లాడుతున్నారు.
విదేశీయుడి సాయంతో ఫోన్ నంబర్లు
ఐర్లాండ్, ఇంగ్లండ్ దేశాల్లోని వ్యాపారులు, వృత్తినిపుణులు, ఐటీ నిపుణులను బెదిరించేందుకు ఎజాజ్, అహ్మద్ అన్సారీ ఇంగ్లిష్ నేర చిత్రాలను చూశారు. బెదిరించి ఎలా మోసం చేయాలన్నది పరిశీలించారు. ఎరిక్ అనే విదేశీయుడికి డబ్బిచ్చి ఆ దేశవాసుల చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఇ-మెయిల్ ఐడీలను సేకరించారు. ఐర్లండ్ దేశస్థులకు పీపీఎస్(పబ్లిక్ పబ్లిక్ సర్వీస్) నంబర్ ద్వారా, ఇంగ్లండ్ వాసులకు నేషనల్ ఇన్సూరెన్స్ నంబర్ల ద్వారా ఫోన్ చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఐర్లాండ్, ఇంగ్లండ్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పేవారు. మీ నగదు కార్యకలాపాల్లో అక్రమాలున్నాయని, పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారని చెప్పేవారు. కేసులు లేకుండా చేస్తామని నగదును ట్రస్ట్ వ్యాలెట్ అనే క్రిప్టో కరెన్సీకి పంపాలని షరతు విధించారు. అందులోని నగదును ఎజాజ్ తన బిట్‌కాయిన్‌లోకి మార్చుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్రస్ట్ వ్యాలెట్ లావాదేవీలు, క్రిప్టో కరెన్సీని ఎక్కడికి బదిలీ చేసుకున్నారు? అంశాలను పోలీసులు పరిశోధిస్తున్నారు.