కొవిడ్-19 లాక్‌డౌన్ మినహాయింపుల అనంతరం వేగంగా వృద్ధి చెందుతున్న ప్రయాణాలు, విహారాలు(Cyber crimes in Tourism), సరకు రవాణా విభాగాల్లో సైబర్ నేరాల సంఖ్య బాగా పెరిగింది. ఇంతకు ముందు మోసగాళ్లు ఎక్కువగా ఆర్థిక నేరాలకు పాల్పడగా, ఇప్పుడు తమ దృష్టిని ఈ రంగాల వైపు మళ్లించారని క్రెడిట్ స్కోర్ సంస్థ ట్రాన్స్‌యూనియన్ నివేదికలో వెల్లడయ్యింది.
2021 రెండో త్రైమాసికంలో అంతర్జాతీయంగా గేమింగ్, ప్రయాణాలు, విహారాలలో అనుమానాస్పద, మోసపూరిత ప్రయత్నాలు కనిపించాయి. అంతర్జాతీయంగా చూసినప్పుడు ఇది 393 శాతం పెరిగింది. 2020 రెండో త్రైమాసికంతో పోలిస్తే.. భారత్‌లో ప్రయాణాలు, విహారాల(Cyber crimes in Tourism)లో 269.72శాతం, కమ్యూనిటీల్లో (ఆన్‌లైన్ డేటింగ్, ఇతర ఆన్‌లైన్ ఫోరాలు) 267.88 శాతం, లాజిస్టిక్స్‌లో 94.84 శాతం మోసాలు పెరిగాయి. దాదాపు 40వేలకు పైగా వెబ్‌సైట్లు, యాప్‌లను విశ్లేషించి, ట్రాన్స్‌యూనియన్ ఈ నివేదికను విడుదల చేసింది.
కొన్ని నెలలకోసారి మోసగాళ్లు ఒక రంగం నుంచి అధిక వృద్ధి కనిపిస్తున్న మరో రంగం వైపు తమ దృష్టి మరలుస్తుంటారని ట్రాన్స్‌యూనియన్ గ్లోబల్ ఫ్రాడ్ సొల్యూషన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షాయ్ కోహెన్ అన్నారు. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో అన్ని దేశాలూ కొవిడ్-19 లాక్‌డౌన్ల నుంచి మినహాయింపు ఇవ్వడం ప్రారంభించడంతో ప్రయాణాలు, విహార యాత్రల(Cyber crimes in Tourism)కు గిరాకీ పెరిగింది. దీంతో మోసగాళ్లు ఈ రంగాలను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక సేవల్లో మోసాలు గతంతో పోలిస్తే 18.8 శాతమే అధికమయ్యాయి.
టెలికాంలో తగ్గాయ్ :
కొన్ని రంగాల్లో సైబర్ మోసాలు తగ్గాయి. టెలికమ్యూనికేషన్లలో 96.64%, రిటైల్‌లో 24.88%, గ్యాంబ్లింగ్ తదితర వాటిల్లో 31.53% మేర తగ్గాయని నివేదిక పేర్కొంది. మోసగాళ్ల నుంచి తమ వినియోగదారులను కాపాడేందుకు వ్యాపార సంస్థలు తగిన భద్రతను ఏర్పాటు చేసుకోవడం, సురక్షిత లావాదేవీలు చేసేలా భరోసా కల్పించడం తప్పనిసరి అయ్యిందని ట్రాన్స్‌యూనియన్ పేర్కొంది.
మరోవైపు.. ఇటీవలే... కొవిడ్ విజృంభణ కారణంగా ఉద్యోగుల పనిపోకడల్లో మార్పుల దరిమిలా ఇళ్లలోని కంప్యూటర్లపై దాడులు అధికమైనట్లు సెర్టిన్ (భారత జాతీయ కంప్యూటర్ అత్యవసర స్పందన బృందం) నిరుడు నిగ్గు తేల్చింది. భారతీయ విద్యుత్ గ్రిడ్లపై సైబర్ దాడులకు చైనా యత్నించిందని (china cyber attack on india) ఆరు నెలల క్రితం వెల్లడైంది. దేశ రవాణా రంగానికీ సైబర్ దాడుల ముప్పు పొంచి ఉందని కేంద్రం అప్పట్లోనే ప్రకటించింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్), మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీస్ విభాగం నుంచి సమాచారం తస్కరణకు గురైనట్లు నిన్న కాక మొన్ననే బయటపడింది. వ్యక్తులు, సంస్థలతోపాటు వ్యవస్థలకు సైబరాసురుల తాకిడి పెరుగుతున్న వేళ- వాలంటీర్లుగా తమ పేర్లు నమోదు చేయించుకోవాలని పౌరులకు కేంద్రం పిలుపిచ్చింది.