మీకు ఎస్‌బీఐలో ఖాతా ఉందా..? అప్రమత్తం కావాల్సిందే. లేదంటే మీరు సైబర్ కేటుగాళ్ల(Cyber Crimes in telangana) వలకు చిక్కే ప్రమాదముందని సైబరాబాద్, రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు(Telangana Cyber Crime Police) హెచ్చరిస్తున్నారు. కేవైసీ అప్‌డేట్ కాలేదని.. మొబైల్ యాప్ బ్లాక్ అవుతుందంటూ వచ్చే ఎస్‌ఎంఎస్‌లను నమ్మొద్దని స్పష్టం చేస్తున్నారు. ఈ తరహాలో మోసపోయే బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎస్‌ఎంఎస్.. కింద లింక్
వేర్వేరు నంబర్ల నుంచి ఎస్‌ఎంఎస్‌లు వస్తుంటాయి. అవి చూడటానికి ఎస్‌బీఐ నుంచి వచ్చినట్లుగానే అనిపిస్తాయి. మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించి కేవైసీ(నో యువర్ కస్టమర్) ప్రక్రియ పూర్తి కాలేదని కొన్నింటిలో ఉంటుంది. కింద ఇచ్చిన లింక్‌లో సంబంధిత ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్ చేయకపోతే ఖాతాను స్తంభింపజేస్తామని హెచ్చరిస్తుంటారు. మరికొన్నేమో ఎస్‌బీఐ మొబైల్ యాప్ ‘యోనో’కు సంబంధించినవి ఉంటాయి.
నకిలీ వెబ్‌సైట్... లాగిన్ ఎర్రర్
చాలా మంది ఎస్‌ఎంఎస్ బ్యాంక్ నుంచే వచ్చిందనుకుని లింక్‌ను క్లిక్ చేస్తున్నారు. అప్పుడు ఎస్‌బీఐ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుండటంతో వారికి మరింత నమ్మకం ఏర్పడుతుంది. నిజానికి అది నకిలీది. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, ఓటీపీ తదితర వివరాలను నమోదు చేయమని అడుగుతున్నారు. చేయగానే ‘లాగిన్ ఎర్రర్’ అని వస్తుంది. ఆ క్రమంలోనే సైబర్ కేటుగాళ్లు మనం అక్కడ నమోదు చేసిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, ఓటీపీ సాయంతో మన బ్యాంక్ ఖాతాను ఖాళీ చేస్తున్నారు. వాళ్ల ఖాతాల్లోకి డబ్బు మళ్లించుకుంటున్నట్లుగా పోలీసులు వివరిస్తున్నారు.
లింక్స్‌ను క్లిక్ చేయొద్దు
"బల్క్ ఎస్‌ఎంఎస్‌లను నమ్మొద్ధు ఎస్‌ఎంఎస్‌ల్లో కనిపించే లింక్స్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్ధు బ్యాంక్ ఎప్పుడూ కేవైసీ అప్‌డేట్ చేయమని ఎస్‌ఎంఎస్ పంపించదు. ఏదైనా సమస్య ఎదురైతే/అనుమానం వస్తే వెంటనే బ్యాంక్‌ను సంప్రందించాలి."
- ఎస్.హరినాథ్, రాచకొండ సైబర్‌క్రైమ్స్ ఏసీపీ