రాష్ట్రంలో ప్రస్తుతం సైబర్ నేరాలు నిత్యకృత్యమయ్యాయి. మామూలు నేరాలను మించిపోతున్నాయి. కొత్తకొత్త ఎత్తుగడలతో ప్రజలను మాయచేసి దోపిడీకి పాల్పడుతున్న ఈ నేరగాళ్ల(Cyber criminals)ను అదుపు చేయడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. బ్యాంకు ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, విద్యార్థులు.. ఒకరేమిటి సైబర్ నేరాల పట్ల అవగాహన ఉన్న పోలీసు అధికారులు కూడా వీరి బుట్టలో పడుతున్నారు.
నిందితుల గుర్తింపూ కష్టమే
సకాలంలో నిందితుల(Cyber criminals)ను గుర్తించి, చట్టపరంగా శిక్షలు విధిస్తేనే నేరాల నియంత్రణ సాధ్యమవుతుంది. కాని సైబర్ నేరాల విషయంలో ఇది వీలుకావడంలేదు. అసలు నిందితులను గుర్తించి, వారిని పట్టుకోవడమే కష్టంగా ఉంటోంది. విదేశాలతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వీరు మోసాలకు పాల్పడుతున్నారు. అసలు ఎక్కడి నుంచి మోసం చేస్తున్నారన్న విషయం గుర్తించడమే అత్యంత క్లిష్టమైన అంశం. గుర్తించిన తర్వాత వారిని వారిని అరెస్టు చేయడం పెద్ద ప్రయాస. ఆయా రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకొని నిందితులను పట్టుకోవాలి. ఎలాగో వారిని పట్టుకొని ఇక్కడకు తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టినా వీరిని ఎక్కువ కాలం రిమాండులో ఉంచడం సాధ్యంకావడంలేదు. బెయిల్ రాగానే పరారవుతున్నారు. సొంత రాష్ట్రానికి వెళ్లగానే మకాం మార్చేస్తారు. మళ్లీ వారిని గుర్తించడం, అరెస్టు చేసి తీసుకొని రావడం చాలా సందర్భాల్లో అసలు సాధ్యం కావడంలేదు.
ఐదారు కేసుల్లోనే శిక్షలు
సైబర్ నేరాల్లో ఏడాదికి నాలుగైదు కేసుల్లో కూడా శిక్షలు పడడంలేదని ఈ కేసులు చూస్తున్న అధికారి ఒకరు తెలిపారు. గత ఏడాది 4,000కు పైగా కేసులు నమోదయితే కేవలం నాలుగింటిలోనే శిక్ష పడిందని చెప్పారు. శిక్ష పడకపోతే భయం ఉండదని, పైగా పరారీలో ఉన్నంతకాలం మళ్లీ అవే నేరాలు చేస్తూనే ఉంటుంటారని, సైబర్ నేరాలు ఎక్కువగా జరగడానికి ఇదే కారణమని ఆయన విశ్లేషించారు. కాలు కదపకుండా సులభంగా రూ.లక్షలు కొల్లగొట్టే అవకాశం ఉండటంతో నేరగాళ్లు దీనినొక వృత్తిగా మలచుకున్నారని తెలిపారు. ఒకవేళ పట్టుబడ్డా పారిపోయి మళ్లీ పాత బాట పడుతున్నారని ఆయన వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి కేసులో నేరస్థులకు కచ్చితంగా శిక్ష పడేలా చూసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించామన్నారు.
కరోనా కారణంగా చాలామంది ఇంటి నుంచి పనిచేయడం, ఆన్‌లైన్ పాఠాల వంటి వాటివల్ల ఇంటర్నెట్ వినియోగం పెరగడం సైబర్ నేరగాళ్ల పంట పండిస్తోంది. కాలు కదపకుండా ఖాతాలు ఖాళీ చేసేస్తున్నారు. 2019 సంవత్సరంలో రాష్ట్రంలో 2,691 సైబర్ నేరాలు జరగ్గా 2000 నాటికి అవి 4,544కు పెరిగాయి. అంటే రెట్టింపు అయినట్లు. ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో ఒక్క హైదరాబాద్‌లోనే ఇలాంటి నేరాలు 1400 వరకు జరగ్గా సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో కలిపి 2,000 వరకూ ఉంటాయి.