సమయం ఆదా చేసుకునేందుకు, దైనందిన కార్యక్రమాలు సులువుగా నిర్వహించేందుకు జనం వినియోగిస్తున్న చరవాణిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరస్థులు చేస్తున్న మోసాలు(cyber crimes in Hyderabad) అంతకంతకూ పెరుగుతున్నాయి. నగదు.. వాహనాలు.. బహుమతులు... సేవల పేరుతో ప్రజలను కొల్లగొడుతున్నారు. హత్యలు, దొంగతనాల వంటి నేరాలను అధిగమించి సైబర్ నేరాలు(cyber crimes in Hyderabad) దూసుకెళ్తున్నాయని జాతీయ నేర గణాంకాల బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది. మెట్రో నగరాల్లో సైబర్ నేరాల(cyber crimes in Hyderabad)ను పరిశీలిస్తే... మూడేళ్లలో హైదరాబాద్‌లో ఐదు రెట్లు పెరిగాయి. బెంగళూరు, ముంబయి నగరాల్లో రెండు రెట్లు పెరిగాయని ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు విడుదల చేసింది. సైబర్ నేరస్థుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
నేరాలు తగ్గుతున్నా.. తీవ్రత అధికం
జాతీయ నేర గణాంకాల బ్యూరో పేర్కొన్న విభాగాలు, నేరాల ఆధారంగా నేరాల సంఖ్య స్వల్పంగా తగ్గుతున్నా.. తీవ్రత మాత్రం గణనీయంగా పెరుగుతోంది. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో మహిళలు, యువతులపై వేధింపులు, లైంగిక దాడులు, హింస వంటివి కొంత తగ్గినా.. అత్యాచార ఘటనలు పోలీస్ శాఖ వైఫల్యాలను ఎత్తిచూపిస్తున్నాయి. ప్రధానంగా యువతులు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రెండేళ్లలో పోక్సో కేసులు అనూహ్యంగా పెరిగాయి. ‘షి’ బృందాలు, మహిళా పోలీస్ ఠాణాల్లో కేసులు నమోదు చేస్తున్నా, నేరస్థులను శిక్షిస్తున్నా సరే వేధింపులు, బెదిరింపులు ఇంకా కొనసాగుతున్నాయి. గతేడాది కరోనా వైరస్ ప్రభావం కారణంగా కళాశాలలు, విద్యాసంస్థలు మూతపడడంతో వేధింపులు, హింస, చిన్నారులపై లైంగిక వేధింపులు కొంత తగ్గాయి. చిన్నారులను రక్షించేందుకు పోలీస్ యంత్రాంగం చర్యలు చేపడుతున్నా.. దిల్లీ, ముంబయి, బెంగళూరుల్లో నేరాలు కొనసాగుతూనే ఉన్నాయి.