వనపర్తి జిల్లా కేంద్రం శివారులో నూతనంగా నిర్మించబోతున్న మెడికల్ కళాశాలకు కేటాయించిన 50 ఎకరాల స్థలం వద్ద రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. మంగళవారం రోజున రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో గల మోటర్లకు ఉన్న విద్యుత్ కనెక్షన్లను ట్రాన్స్‌కో అధికారులు కట్ చేయడంతో రైతులు ఆగ్రహించారు.
తాతల కాలం నుంచి తామే సాగు చేసుకుంటుంటే... ఇది ప్రభుత్వ భూమి అనడమేంటని అధికారులతో రైతులు వాదించారు. ఈ భూమునే ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్న తమ భూములను ఏవిధంగా లాగేసుకుంటారని అధికారులను నిలదీశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. అధికారులను అడ్డుకున్న రైతులను చెదరగొట్టే ప్రయత్నంలో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులు తొలగించిన విద్యుత్ కనెక్షన్లను వెంటనే ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు.
మెడికల్ కళాశాల కోసం కేటాయించిన సర్వే నెంబర్ 200లోని భూమి పూర్తిగా ప్రభుత్వ భూమి అని పోలీసులు తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రైతులు దీన్ని సాగు చేసుకుంటున్నారని అన్నారు. పై అధికారులతో మాట్లాడి వారికి ఏదైనా జీవనోపాధి కల్పించేందుకు ప్రయత్నం చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. దీంతో స్థానిక నాయకులు రైతులకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
ఇదీ చదవండి: ప్రేమ వ్యవహారంతో... యువకున్ని చితకబాదిన యువతి బంధువులు