ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం సర్పంచ్ ఎన్నికల్లో.. తెదేపా మద్దతుదారు గెలుపుపై వైకాపా కార్యకర్తలు దూషణలు చేశారు. తొలుత మహిళల మధ్య వివాదం చెలరేగింది. అదికాస్త చినికి చినికి గాలివానలా విస్తరించి గ్రామంలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. రాళ్లు, కర్రలతో పరస్పరం దాడి చేసుకోగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇళ్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఈ ఘర్షణపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అనంతరం బాధితులను శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. గెలుపు విషయంపై మాటామాటా పెరగడంతో.. ఘర్షణకు దారి తీసిందని గ్రామస్థులు తెలిపారు. ప్రస్తుతం గ్రామంలో భయానక వాతావరణం నెలకొందని వెల్లడించారు.
ఇదీ చదవండి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి