Child workers in Zaheerabad: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. బాలకార్మిక చట్టాలు ఉన్నా వారికి విముక్తి మాత్రం లభించడం లేదు. తాజాగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో దాదాపు 15 మంది బాలురు ట్రాక్ పనుల్లో కూలీలుగా పని చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, గుత్తేదారులు ఇష్టారాజ్యంతో బడిలో పాఠాలు చదవాల్సిన పిల్లలు కూలీలుగా మారుతున్నారు.
ఒడిశా-ఛత్తీస్‌గఢ్ నుంచి బాలకార్మికులు
Railway track works in zaheerabad: ట్రాక్ ప్యాకింగ్ పేరుతో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి బాల కార్మికులను తీసుకొచ్చి రైల్వే కాంట్రాక్టర్ పనులు చేయిస్తున్నారు. ఇందుకు రైల్వే సిబ్బంది సైతం వారిని పర్యవేక్షిస్తూ స్థాయికి మించిన పనులు చేయిస్తూ ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. రోజూ మూడు నుంచి నాలుగు వందల రూపాయలు కూలీ చెల్లిస్తున్నారని బాల కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మండుటెండలో పట్టాలపై పనిచేస్తున్న బాల కార్మికులను పరిస్థితిని చూసిన ప్రయాణికులు సైతం చలించిపోతున్నారు. అయ్యో పాపం అంటూ సానుభూతి తెలుపడం కనిపించింది. బాల కార్మిక నిర్మూలన విభాగం అధికారులు దృష్టి సారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.