కొవిడ్ కారణంగా ఐటీ సంస్థల్లో వందల సంఖ్యలో కొత్త ఉద్యోగాలున్నాయంటూ ఇంజినీరింగ్ పూర్తైన విద్యార్థులను సైబర్ నేరస్థులు(Cyber Crime in Telangana) నమ్మిస్తున్నారు. అనంతరం ఆయా సంస్థల మానవ వనరుల విభాగం అధికారులుగా ఫోన్లు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్.. ధరావతుల కోసం నగదు చెల్లించాలంటూ రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లతో పాటు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఈ మోసాలు వెలుగు చూశాయి. రెండు నెలల్లో రూ.1.8 కోట్లు కొల్లగొట్టారు.
టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్ర కంపెనీలు అభ్యర్థుల నుంచి నేరుగా డబ్బు కట్టించుకోవన్నది గమనించాలంటూ పోలీసులు వివరిస్తున్నారు. దిల్లీ.. నోయిడాల్లో పదుల సంఖ్యలో ముఠాలున్నాయని వీటిపై నిఘా ఉంచామని తెలిపారు. హిమాయత్‌నగర్‌లో ఉంటున్న సునయన పాటిల్‌కు వారం రోజుల క్రితం మనీష్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. తాను పుణెలోని ఇన్ఫోసిస్‌లో మానవ వనరుల విభాగంలో విధులు నిర్వహిస్తున్నానని చెప్పాడు. మాన్‌స్టర్ డాట్‌కాంలో మీ విద్యార్హతలు చూశాం.. ట్రైనీ ఇంజినీర్‌గా ఉద్యోగం ఇస్తామంటూ చెప్పాడు. అతని సూచన మేరకు ఆమె రిజిస్ట్రేషన్ రుసుం రూ.10వేలు చెల్లించింది. ధరావతు, పుణెలో వసతి కలిపి తొమ్మిది నెలలకు రూ.4.50లక్షలు పంపించాలని మనీష్ వివరించాడు(Cyber Crime in Telangana). అంతర్జాలం ద్వారా ఆన్‌లైన్ పరీక్ష ఉంటుందని చెప్పాడు. తరువాత ఈ సమాచారం కోసం సునయన వరుసగా ఫోన్లు చేసినా మనీష్ స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నౌకరీ... మాన్‌స్టర్... షైన్..
ఐటీ కంపెనీల్లో ఉద్యోగం పొందేందుకు నౌకరీ డాట్‌కాం, షైన్, మాన్‌స్టర్, క్వికర్ డాట్‌కాం తదితర వెబ్‌సైట్లలో నిరుద్యోగులు తమ అర్హతలను నమోదు చేస్తున్నారు. తాము కొత్తవారికి ఉద్యోగాలిస్తామంటూ సైబర్ నేరస్థులు(Cyber Crime in Telangana) ఆయా వెబ్‌సైట్ల నుంచి ఉద్యోగార్థుల వివరాలను గంపగుత్తగా కొంటున్నారు. అనంతరం రోజుకు 200- 300ల మందికి నేరుగా ఫోన్లు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ రుసుం రూ.10వేల వరకూ వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత ధరావతు, హాస్టల్, రవాణా ఛార్జీలు రూ.లక్ష నుంచి రూ.3లక్షలు వసూలు చేసుకున్నాక ఫోన్ స్విచ్ఛాఫ్ చేస్తున్నారు. ఐటీ సంస్థల మానవవనరుల విభాగం ఫోన్ నంబర్లు, సైబర్ నేరస్థులు చెప్పిన ఫోన్ నంబర్లు సరిగ్గానే ఉండడంతో ఉద్యోగార్థులు నిందితుల మాటలు నమ్మి రూ.లక్షలు పోగొట్టుకుంటున్నారు.