Attack on Constable: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో గొలుసు దొంగలు చెలరేగి పోతున్నారు. వారిని పట్టుకునేందుకు వెంబడిస్తున్న కానిస్టేబుల్ యాదయ్యపై ఓ దొంగ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు కాగా.. బీరంగూడ కూడలి సమీపంలో ఉన్న పనేషియా మెరీడియన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
గత రాత్రి కూకట్పల్లి పీఎస్ పరిధిలోని మూసాపేటలో నడుచుకుంటూ వెళ్తున్న పార్వతి అనే మహిళ మెడ నుండి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు గొలుసు లాక్కెళ్లారు. పల్సర్ బైక్‌పై వచ్చి చోరీకి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నిందితుల ఫోటోలు సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేసి వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
24 గంటలు గడవక ముందే ఈ రోజు ఉదయం మియాపూర్ మాతృశ్రీనగర్ కాలనీలో మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లారు. మియాపూర్ ఉషోదయ ఎంక్లేవ్ లోను చోరీకి యత్నించారు. దీంతో సీసీఎస్‌తో పాటు ఎస్‌వోటి బృందాలు రంగంలోకి దిగి నిందితులు వెళ్లిన దారిలోని సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించారు. వారు రామచంద్రాపురం పోలీస్టేషన్ పరిధిలోని అశోక్ నగర్ హెచ్‌ఐజీ గేట్ సమీపంలో ఉన్నారని సమాచారం అందింది. అక్కడే సీసీఎస్ కానిస్టేబుల్ యాదయ్యతో పాటు ఒక బృందం వేచి చూస్తోంది. ఇంతలో ఇద్దరు నిందితులు ద్విచక్ర వాహనంపై వస్తుండటం చూసిన యాదయ్య అతని టీం వారిని అడ్డుకున్నారు. ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న ఓ నిందితుడు అతని వద్ద ఉన్న కత్తితో యాదయ్య పొట్ట భాగంలో పొడిచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో అక్కడికి చేరుకున్న మరో పోలీసు బృందం నిందితులను పట్టుకున్నట్లు సమాచారం.
తీవ్ర గాయాలపాలైన యాదయ్యను బీరంగూడ వద్ద ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటన విషయం తెలసుకున్న సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆస్పత్రికి చేరుకుని యాదయ్యను పరామర్శించారు. అనంతరం అతనికి మెరుగైన చికిత్స కోసం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అయితే నిందితులను పట్టుకున్న విషయం పోలీసులు ధృవీకరించలేదు. ఈ ఘటనతో పోలీసు శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఇవీ చదవండి: 'అందరూ అప్రమత్తంగా ఉండండి.. ప్రాణనష్టం జరగకుండా చూడండి..'
డోలీలో నిండు గర్భిణీ.. అడవిలో 6కి.మీ నడక.. నాలుగు గంటల తర్వాత..