The police caught a gang of thieves: కొంత మంది వ్యక్తులకు పోలీసులు ఎన్నిసార్లు చెప్పిన దొంగతనాలు చేయడం మానరు. పైగా వృత్తిలా భావిస్తారు. అలాంటి వారిపై పోలీసులు నిఘా తరుచు ఉంచుతారు. వారు దొంగతనానికి పాల్పడితే వెంటనే పట్టుకుంటారు. అదే విధంగా తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను రాచకొండ, సీసీఎస్ భువనగిరి మోత్కూరు పోలీసులు అరెస్టు చేశారు.
రాచకొండ సీపీ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం..ఎక్కువగా చోరీలకు చేస్తున్న ఆరుగురు దొంగలను భువనగిరి మోత్కూరు పోలీసులు అరెస్టు చేశారు. దొంగల ముఠా నుంచి సుమారు 32 లక్షల విలువ చేసే 50తులాల బంగారం, 2.5కిలోల వెండి, రెండు ద్విచక్ర వాహనాలు తొమ్మది చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. భువనగిరికి చెందిన ప్రధాన నిందితుడు బొడిగె అశోక్ తన అనుచరులు ఐదుగురితో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. గతంలో కూడా పలుమార్లు అరెస్టయిన ఆశోక్ జైలుకు వెళ్లి వచ్చినప్పటికీ మారకుండా దొంగతనాలు చేయడమే వృత్తిగా పెట్టుకున్నాడు.
జైలులో కలిసిన మరికొంత మందితో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. ఈ ముఠా వివిధ పోలీసు స్టేషన్‌ల పరిధిలో 35 దొంగతనాలకు పాల్పడినట్లు రాచకొండ సీపీ చౌహాన్ తెలిపారు.నగర శివారుల్లోని రోడ్డు పక్కన గల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళల్లో ఇంటి తాళాలు పగలగొట్టి వీరు చోరీలకు చేస్తున్నారని చౌహాన్ వివరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చోరీల గురించి ప్రజలను ముందే అప్రమత్తం చేయడంతో పండుగ దొంగతనాలను అరికట్టగలిగామని ఆయన తెలిపారు. రోజుల తరబడి ఇళ్ల నుంచి బయటకు వెళ్లే ప్రజలు ముందుగానే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ కోరారు.
"అశోక్ అనే నిందితుడికి ఎన్నిసార్లు చెప్పిన సరే అతను దొంగతనాలు చేయడం ఆపలేదు. నిత్యం మద్యం తాగుతూ దొంగతనాలు చేయడం వృత్తిగా చేసుకొన్నాడు. అందువలన తనపై ప్రతిరోజు సాధారణంగా, సాంకేతికంగా నిఘా పెట్టాం. నిందితుడిని 2019లో అరెస్టు చేశాం. తరవాత జైల్లో పరిచయమైన వ్యక్తులతో చోరీలు చేయడం మెుదలుపెట్టాడు. నిన్న రాత్రి నిందితుడిని పట్టుకున్నాం. తన గ్యాంగ్‌లో ఉన్న మిగిలిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశాం. వారి దగ్గర నుంచి రూ.32 లక్షల విలువైన సంపదను స్వాధీనం చేసుకున్నాం." - డీఎస్ చౌహాన్, రాచకొండ సీపీ
ఇవీ చదవండి: