తప్పుడు పత్రాల(Fake Documents)తో రూ.15 కోట్ల రుణం తీసుకొని బ్యాంకును మోసం చేసిన కేసులో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరితోపాటు బెంగళూరుకు చెందిన అయిదుగురిపై బెంగళూరు సీబీఐ విభాగం గత సోమవారం కేసు నమోదు చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బెంగళూరు, మైసూర్ బ్రాంచ్ సర్కిల్‌కు చెందిన డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం.వి.ఆర్.మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు.
జి.బి.ఆరాధ్య సీఈవోగా, కె.వెంకటేశ్ మేనేజింగ్ పార్టనర్‌గా, జె.హలేష్, అరుణ్ డి కుల్‌కర్ని, జి.పుల్లంరాజు, కె.సుబ్బరాజు, తిరుమలయ్య తిమ్మప్పలు భాగస్వాములుగా అంకిత్ బయోఫ్యూయల్స్ పేరుతో ఓ సంస్థను స్థాపించారు. ప్లాంట్‌ను బెంగళూరు శివార్లలోని తుముకూర్‌లో చూపించారు. జీవ వ్యర్థాల నుంచి ఇంధనానికి ఉపయోగపడే ఇటుకలు, పిల్లెట్లు తయారీ పరిశ్రమ నెలకొల్పుతామని 2015లో రూ.15 కోట్ల రుణం కోసం బ్యాంకుకు దరఖాస్తు చేశారు. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా మజీద్‌పూర్ గ్రామంలో సర్వే నంబర్ 91, 92, 93, 100, 101, 102లలో పుల్లంరాజు, సుబ్బరాజుల పేర్ల మీద ఉన్న 56 ఎకరాల 36 గుంటల భూమిని తనఖా పెట్టారు. సాంకేతిక కారణాలతో ఈ రుణం ద్వారా నెలకొల్పిన వ్యాపారాన్ని బ్యాంకు 2017 జూన్ 28న నిరర్థక ఆస్తిగా ప్రకటించింది. తదనంతరం జరిగిన అంతర్గత దర్యాప్తులో పుల్లంరాజు, సుబ్బరాజుల పేర్ల మీద కేవలం 32 ఎకరాల 21 గుంటల భూమి మాత్రమే ఉందని తేలింది. రుణం కోసం తప్పుడు పట్టాపాస్ పుస్తకాలు(Fake Documents) అందించారని వెల్లడించింది.
ఇవే ఆస్తులను ఐఎఫ్‌సీఏ వెంచర్ క్యాపిటల్ ఫండ్ లిమిటెడ్ అనే సంస్థ వద్దా తనఖా పెట్టారని, అప్పుడు ఈ ఆస్తి విలువ కేవలం రూ.5.80 కోట్లుగా మాత్రమే చూపించారని వెల్లడయింది. ఇదే ఆస్తిని స్టేట్ బ్యాంకులో తనఖా పెట్టినప్పుడు రూ.30 కోట్లుగా చూపించారు. ఇక మంజూరు చేసిన రుణంలో రూ.5.34 కోట్లు జి.బి.ఆరాధ్య నెలకొల్పిన సన్ ఆగ్రోటెక్, సన్ బయో ఫ్యూయల్స్, సన్ ఎకో ఫ్లేమ్స్ తదితర సంస్థల్లోకి, రూ.15.1 లక్షలు ఆరాధ్య వ్యక్తిగత ఖాతాలోకి, రూ.89 లక్షలు జె.హలేష్‌కు చెందిన హై ప్రొటెక్ ప్రాజెక్ట్స్ సంస్థలోకి మళ్లించినట్లు తేలింది. తప్పుడు పత్రాల(Fake Documents)తో రుణం తీసుకోవడం, దాన్ని నిబంధనలకు విరుద్ధంగా తామే నెలకొల్పిన వేర్వేరు సంస్థల్లోకి మళ్లించి మోసం చేసినందున వీరందరిపై సీబీఐ కేసు నమోదు చేసింది.