Banjara hills Accident Today : హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. రోహిత్ గౌడ్, సుమన్ ఇద్దరూ మద్యం తాగి కారులో అతి వేగంగా వెళుతూ ఈ ప్రమాదానికి కారణమయ్యారు. ఈ ఘటనలో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన అయోధ్యరాయ్, దేబంద్ర కుమార్ విధులు ముగించుకుని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లో నడుచుకుంటూ వెళ్తున్నారు. కొద్దిసేపట్లో వారి గదికి చేరుకునే వారు. కానీ వారిని కారు రూపంలో మృత్యువు వెంబడించింది.
రోడ్ నంబర్-2లో అతివేగంతో అయోధ్యరాయ్, దేబంద్రకుమార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతులు అయోధ్య రాయ్ ఘజిపూర్‌కు చెందినవాడు కాగా.. నందినగర్‌లో నివాసం ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. మరో మృతుడు దేవేందర్ కుమార్ దాస్ ఒడిశా జగత్‌సింగ్‌పూర్ జిల్లా గోపాల్‌పురా గ్రామానికి చెందినవాడు. ఏడాదిన్నర క్రితం వివాహమైంది. గౌరి శంకర్ కాలనీలో నివాసం ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు.
మద్యం మత్తులోనే..
ప్రమాదం తర్వాత రోహిత్ గౌడ్ కారుతో సహా పరారయ్యాడు. తెల్లవారుజామున 4 గంటలకు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ప్రమాద సమయంలో రోహిత్‌తో పాటు కారులో ఉన్న మరో వ్యక్తి సుమన్ మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు గుర్తించారు. నిందితులు దుర్గంచెరువు వద్ద ఉన్న ఆలివ్ విస్ట్రో పబ్‌లో మద్యం సేవించారని పోలీసులు గుర్తించారు. రోహిత్ వాహనం నడుపుతున్నాడని.. అతని ఆల్కహాల్ బ్రీత్ ఎనలైజైర్ 70 పాయింట్లుగా చూపించిందన్నారు. మరోవ్యక్తి డ్రైవర్ పక్క సీటులో ఉన్న సుమన్ బ్రీత్ అనలైజర్ 58 పాయింట్లుగా ఉందన్నారు. పబ్‌లో మద్యం తాగి.. బంజారాహిల్స్ పార్క్ హయత్ హోటల్ వైపు వెళ్తుండగా కారు ఇద్దరు వ్యక్తులను ఢీ కొట్టిందని పోలీసులు నిర్ధరించారు.
రోహిత్‌పై సెక్షన్ 304 కింద కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ తాగి ఉన్నాడని తెలిసీ కారులో కూర్చున్నందుకు రోహిత్ స్నేహితుడు సుమన్‌పైనా కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం నిందితులు ఇద్దరినీ రిమాండ్‌కు తరలించినట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: Accident on Highway: హైదరాబాద్- విజయవాడ హైవేపై ప్రమాదం.. భారీ ట్రాఫిక్ జామ్