వరంగల్ జిల్లాలో కారు కాల్వలో పడిన ఘటన మరువకముందే.. అలాంటి సంఘటనే జగిత్యాల జిల్లా మేడిపల్లిలో చోటుచేసుకుంది. మేడిపల్లి ఎస్సారెస్పీ కాల్వలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. జగిత్యాల నుంచి జోగినపల్లి వెళ్తుండగా... ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు ప్రయాణిస్తున్నారు. న్యాయవాది అమరేందర్‌రావు సహా... అతడి భార్య, కుమారుడు, కుమార్తె కారులో ఉన్నారు. కారు కాల్వలోకి దూసుకెళ్లగా... ప్రమాదం నుంచి కుమారుడు జయంత్ సురక్షితంగా బయటపడ్డారు. దంపతులు అమరేందర్‌రావు, శిరీష సహా... కుమార్తె శ్రేయ ప్రాణాలు కోల్పోయారు.
మొక్కులు తీర్చుకుందామని వెళ్తు
కుమార్తె శ్రేయకు ఇటీవలే పెళ్లి ఖాయమైంది. సొంతూరు జోగినపల్లిలో జరుగుతున్న ఉత్సవాలకు వెళ్లి మొక్కులు తీర్చుకుందామని కుటుంబసభ్యులు నలుగురు జగిత్యాల నుంచి బయల్దేరారు. మేడిపల్లి వరకు రాగానే... వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి కాల్వలో పడిపోయింది. కారు నుంచి జయంత్ సురక్షితంగా బయటపడగా... మిగతా ముగ్గురు మాత్రం కారులోనే చిక్కుకున్నారు. నీటి ప్రవాహ వేగానికి కారు కొంత దూరం కొట్టుకుపోయింది. స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టేలోపే కారులో ఉన్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో కారును బయటకు తీశారు.
మృతులు ఎమ్మెల్యే సమీప బంధువులు
మృతులు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు దగ్గరి బంధువులవుతారు. ప్రమద విషయం తెలుసుకోగానే... ఎమ్మెల్యే హుటాహుటినా ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. దగ్గరి బంధువులను కోల్పోవడం బాధగా ఉందని... సంజయ్ కుమార్ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం మృతదేహాలను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి : బైక్‌ను తప్పించబోయి కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు జలసమాధి