హైదరాబాద్ రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మామిడిపల్లి నుంచి పీవీ వే మీదుగా బంజారాహిల్స్ వెళ్తున్న కారులో మంటలు చెలరేగాయి. గమనించిన తోటి ప్రయాణికులు.. కారులో ప్రయాణిస్తున్న తల్లి, 2 నెలల కూతురు, ఇద్దరు కుమారులను సురక్షితంగా బయటకు తీశారు.
మామిడిపల్లికి చెందిన శైలజ.. బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తుండగా అత్తాపూర్ 135 నంబరు పిల్లర్ వద్దకు రాగానే అకస్మాత్తుగా కారులో నుంచి మంటలు చెలరేగాయి. కారులో మహిళతో పాటు ఆమె ముగ్గురు పిల్లలు ఇరుక్కుపోయారు. అదే దారిలో వెళ్తున్న రవి అనే వ్యక్తి ప్రాణాలకు తెగించి వారిని కాపాడారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అదే సమయంలో హైవేపై కారులో వెళ్తున్న గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. సంఘటనను పరిశీలించారు.
శైలజ, వారి పిల్లలను రాజేంద్రనగర్ పోలీసులు సురక్షితంగా ఇంటికి పంపించారు. వారిని కాపాడిన రవిని ఏసీపీ సంజయ్ కుమార్, స్థానికులు ప్రశంసించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: బుక్కెడు బువ్వ పెట్టమన్నందుకు.. బతికుండగానే బొంద తీశాడు.!