భరత్‌పుర్ కేటుగాళ్ల(Bharatpur Crime Gangs) గురించి తెలియని వారుండరు. ఈ ఏడాది మొదటి ఏడు నెలల్లో ఒక్క తెలంగాణ నుంచే దాదాపు రూ. 100 కోట్ల సొత్తును సైబర్ నేరగాళ్లు కొట్టేయగా ఇందులో 90 శాతం భరత్‌పుర్ ముఠాల(Bharatpur Crime Gangs) పనే. దీన్నిబట్టి వీరి దోపిడీ తీరు అర్థం చేసుకోవచ్చు. దేశంలోని ప్రతి జిల్లాలో వీరి బాధితులున్నారంటే అతిశయోక్తికాదు. మిగతా నేరాల్లో కనీసం సగం కేసుల్లో అయినా సొత్తు రికవరీ జరుగుతుంది. కానీ సైబర్ నేరాల్లో అది ఒక్క శాతానికి మించడం లేదు. చిన్నాపెద్దా తేడాలేదు. ఉన్నతాధికారులు చివరకు బ్యాంకు ఉద్యోగులు, పోలీసులు కూడా బాధితులవుతున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడంలేదని ఎవరికైనా అనుమానం కలుగుతుంది. దీనికి కారణం రాజకీయ ప్రమేయం. ఓటు బ్యాంకు రాజకీయాల వల్లనే స్థానిక ప్రభుత్వం సైబర్ నేరగాళ్లను పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. దాంతోపాటు కొందరు పోలీసులు నేరగాళ్లతో అంటకాగుతున్నారన్నది బహిరంగ రహస్యం. ఈ నేరగాళ్లు కొట్టేసే సొమ్ములో సగం పోలీసులకు, రాజకీయ నాయకులకు చేరుతుండవచ్చని అంచనా. అంటే మనల్ని దోచుకుంటున్నది ప్రత్యక్షంగా కొందరైతే.. పరోక్షంగా మరికొందరన్నమాట!
నోట్లు వీరికి.. ఓట్లు వారికి
భరత్‌పుర్ జిల్లాలోని కామ, నగర్ నియోజకవర్గాల పరిధిలో సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఓట్ల కోసం కొందరు నాయకులు నేరగాళ్లకు అవసరం వచ్చినప్పుడు సాయం చేస్తుంటారు. గత ఏడాది దిల్లీ నుంచి వెళ్లిన పోలీసు బృందం ఓ నిందితుణ్ని అరెస్టు చేస్తే స్థానిక ప్రజాప్రతినిధి ఉన్నతాధికారులతో మాట్లాడి విడిపించారని స్థానికులు తెలిపారు. ఎన్నికలు రాగానే సైబర్ నేరగాళ్లే(Bharatpur Crime Gangs) నాయకులకు సొమ్ము సర్దుబాటు చేస్తుంటారు. ప్రతిగా గెలిచిన తర్వాత వారు వీరి బాగోగులు చూసుకుంటారు. భరత్‌పుర్ ఎస్పీగా పనిచేసిన ఓ అధికారి గత ఏడాది సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీసులకూ ఆయన పూర్తిగా సహకరించారు. దాంతో రాజకీయ ఒత్తిళ్లతో ఆయనను బదిలీ చేశారు. ఇన్ని నేరాలు జరుగుతున్నా అక్కడ నమోదయ్యేవి స్వల్పమే. సైబర్ నేరాలకు సంబంధించి 2020లో భరత్‌పుర్ జిల్లాలో 49 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇక్కడ ప్రత్యేక సైబర్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తామని గత శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చినా ఇప్పటికీ నెరవేరనేలేదు. అధికారులు ప్రతిపాదనలు పంపినా ఆమోదానికి నోచుకోలేదు.
దొంగలతో దోస్తీ
ఇక్కడ పోలీసులు సైబర్ నేరగాళ్ల(Cyber criminals)తో దోస్తీ చేస్తారన్నది బహిరంగ రహస్యం. భరత్‌పుర్ జిల్లాలో 27 పోలీస్‌స్టేషన్లు ఉన్నాయి. ప్రతి స్టేషన్లోనూ నేరగాళ్ల మనుషులుంటారు. తాము ఏదైనా గ్రామంలో నిందితుణ్ని పట్టుకోడానికి వెళ్లినప్పుడు పొరపాటున స్థానిక పోలీసులకు చెబితే ఆ సమాచారం వెంటనే నిందితుడికి చేరిపోతుందని హైదరాబాద్ సీసీఎస్‌కు చెందిన ఓ అధికారి వెల్లడించారు. అందుకే తాము ఏ గ్రామానికి వెళ్లేదీ వారికి తెలీకుండా జాగ్రత్తపడతామని చెప్పారు. అసలు తమకు సాయం చేసేందుకే స్థానిక పోలీసులు ముందుకు రారని, ఉన్నతాధికారులతో చెప్పించుకొని తీసుకెళతామని వివరించారు.
పోలీసులకు సగం వాటా
‘మేం ప్రజలను లూటీ చేస్తుంటే పోలీసులు మమ్మల్ని దోచుకుంటున్నారు’ ఖేత్వాడ్‌కు చెందిన ఓ సైబర్ నేరగాడు చేసిన వ్యాఖ్య స్థానిక పరిస్థితికి అద్దం పడుతుంది. ‘మాకు డబ్బెలా వస్తుందో పోలీసులకు తెలుసు. అడిగినంతా ఇవ్వకపోతే ఏం జరుగుతుందో మాకు తెలుసు. మా సంపాదనలో సగం పోలీసులకు, ప్రజాప్రతినిధులకే’ అంటూ వ్యాఖ్యానించాడు. అసలు ఇక్కడ పోలీసు వ్యవస్థే బలహీనం. 2020 సంవత్సరానికి సంబంధించి జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం తెలంగాణలో 1,47,504 నేరాలు నమోదు కాగా రాజస్థాన్‌లో 2,60,378 నమోదయ్యాయి. తెలంగాణలో పోలీసుల సంఖ్య సుమారు 80 వేలు కాగా రాజస్థాన్‌లో వారి సంఖ్య లక్షా పదివేలు.
పోస్టింగులకు భారీ డిమాండ్
సైబర్ నేరాలు జరుగుతున్న ప్రాంతాల్లో పోస్టింగులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా కామ, భుస్వార, నాద్‌బై తదితర సర్కిళ్ల పరిధిలోని స్టేషన్లలో కానిస్టేబుల్ పోస్టుకు కూడా రూ.లక్షల్లో ధర పలుకుతుందని తెలిసింది. ఇక పైస్థాయి అధికారుల పోస్టుల ధర ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సర్వీసు మొత్తంలో ఇక్కడ ఒక్కసారి పనిచేసినా స్థిరపడవచ్చనేది పోలీసుల భావన. నెలవారీ మూమూళ్లే రూ.లక్షల్లో ఉంటాయని తెలుస్తోంది. ‘ఓరోజు రూ. 3.5 లక్షల సంపాదన వస్తే అందులో రూ.2 లక్షలు పోలీసులే తీసుకున్నారని’ ఖేత్వాడ్‌కు చెందిన ఓ వ్యక్తి వెల్లడించాడు.
ఉపాధి లేకనే..
గ్రామంలో యువకులకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. అందుకే ఎవరికివారు ఇలా సైబర్ నేరాలతో ఉపాధి చూసుకుంటున్నారు. అయితే తేరగా వచ్చి పడుతున్న డబ్బు వల్ల అనర్థాలు మొదలయ్యాయి. అనేకమంది యువకులు వ్యసనాలకు బానిసలవుతున్నారు. ఎంత చెప్పినా వినడం లేదు. ఇది ఎటు దారితీస్తుందో తెలియడంలేదు.
- అబ్దుల్ రజాక్, బిలంక్ గ్రామ మాజీ సర్పంచి
- ఇదీ చదవండి : ఆస్తి పంచడం లేదని ఓ కోడలు ఎంతకి తెగించిందంటే..