Nude Video Calls : రాజస్థాన్‌లోని భరత్‌పూర్ సైబర్ నేరస్థులు ఫేస్‌బుక్ ద్వారా ముంబయి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో యువకులు, వృత్తి నిపుణులను పరిచయం చేసుకుంటారు. ఒకటి, రెండు రోజులు ఫేస్‌బుక్ ద్వారా మాట్లాడిన తర్వాత వారి వాట్సాప్ నంబర్లు తీసుకుంటారు. వాట్సాప్ కాల్ మొదలైన వెంటనే పరిచయం చేసుకున్న యువతి దుస్తులన్నీ విప్పేసి నగ్నంగా మారుతుంది. ఆమె అసలు యువతే కాదు.. అది సాంకేతిక మాయాజాలం. చరవాణిలో అప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్న అశ్లీల వీడియోల్లో ఒకదాన్ని సైబర్ నేరస్థులు పంపుతున్నారు. యువతి పెదాల కదలికలకు అనుగుణంగా వాయిస్ ఛేంజ్ యాప్ ద్వారా అమ్మాయిలా మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది.
Nude Video Call Threats : ఒకటి రెండు రోజులు నగ్న వీడియోల ద్వారా మాట్లాడాక.. మీరు కూడా నగ్నంగా మాట్లాడండి.. అంటూ కోరతారు. బాధితులు వీడియో కాల్ చేయడం మొదలు పెట్టగానే మీ ముఖం కనిపించేలా మాట్లాడండి అంటారు. అవతలి వైపు మాట్లాడుతున్న నిందితుడు మరో కెమెరాతో బాధితుడి మాటలు, దృశ్యాలను రికార్డు చేస్తారు. తర్వాత ఆ వీడియోను బాధితుడికి పంపి బెదిరించి డబ్బు గుంజుతున్నారు.
Cyber Crimes in Hyderabad : నగ్న వీడియోలతో తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ వరుసగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో నిందితులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాకు వెళ్లారు. అక్కడ బాధితుల నుంచి రూ.లక్షల్లో నగదు బదిలీ చేసుకున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. పలు రాష్ట్రాలకు చెందిన వారి నుంచి ఆరేడు నెలల్లోనే వీరు రూ.25 కోట్లు కొల్లగొట్టారని గుర్తించారు.
కెమెరాకు చిక్కి విలవిల
- సైబర్ నేరస్థుల కెమెరాలకు చిక్కిన బాధితులు విలవిలలాడిపోతున్నారు. పరువు పోతుందన్న భయంతో నేరస్థులు చెప్పిన ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు.
- జూబ్లీహిల్స్‌లో ఉండే ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇటీవల ఫేస్‌బుక్ ద్వారా యువతిగా నటించిన సైబర్ నేరస్థుడిని పరిచయం చేసుకున్నాడు. నగ్నవీడియోల ద్వారా సంభాషించాడు. అతడికి చెందిన నగ్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచుతానని రూ.12 లక్షలు గుంజాడు.
- అశోక్‌నగర్‌లో ఉంటున్న ఒక వైద్యుడికి కొద్దిరోజుల క్రితం నేరుగా వాట్సాప్ కాల్ వచ్చింది. ఒక యువతి మాట్లాడింది. రెండ్రోజలు మాట్లాడాక దుస్తులన్నీ తీసేసి మాట్లాడమంది. కాల్ కట్ చేయగా.. మరుసటి రోజు కూడా కాల్ చేసి అలాగే కోరింది. ఎవరూ లేరుకదా.. అని అతను నగ్నంగా మారి సంభాషించాడు. ఆ తర్వాత ఆ వీడియోలను అతడికి పంపారు. వీటన్నింటినీ మీ స్నేహితులకు పంపుతామంటూ బెదిరించగా రూ.15 లక్షలు నగదు బదిలీ చేసినట్లు పోలీసుల ముందు వాపోయాడు.