Bank Of Baroda Cashier Case: వనస్థలిపురం బ్యాంకు ఆఫ్ బరోడా శాఖలో నగదు గోల్మాల్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈనెల 10న బ్యాంక్ నుంచి 22లక్షలు తీసుకెళ్లి ఆచూకీ లేకుండా పోయిన క్యాషియర్ ప్రవీణ్ ఇవాళ హయత్‌నగర్ కోర్టులో ప్రత్యక్షమయ్యాడు. న్యాయమూర్తి ముందు లొంగిపోయిన ప్రవీణ్‌కు కోర్టు ఈనెల 30 వరకు రిమాండ్ విధించింది. అతడిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. లొంగిపోవడానికి ముందు ప్రవీణ్ మీడియాతో మాట్లాడారు.
'బ్యాంకులో చాలా రోజులుగా నగదు లెక్కల్లో తేడా వస్తుంది. అది బ్యాంక్ వాళ్లందరికీ తెలుసు. గతేడాది డిసెంబర్లో లక్ష రూపాయల నగదు తేడా వస్తే... ఫిర్యాదు చేద్దాం అంటే బ్యాంకు రెపుటేషన్ పోతది అన్నారు. వారం క్రితం ఒకేసారి దాదాపు 5 లక్షలకు పైగా తేడా రావడంతో నాకేం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్లిపోయాను. బ్యాంకు ప్రతిష్ఠ దెబ్బతినకూడదని నన్ను ఒక్కడిని నిందిస్తున్నారు. బ్యాంకులోని ఎన్ఆర్ఐ ఖాతాలో కూడా భారీ మోసం జరిగింది దాన్ని అతి త్వరలోనే బయటపెడతాను. బీరువా అలారం వద్ద సీసీ కెమెరా కనిపించదు. సేఫ్ లాకర్లో పెట్టండి అని చెప్పినా వినలేదు. అల్మారాలో డబ్బులు పెట్టొద్దని కూడా చెప్పాను.'-ప్రవీణ్, బ్యాంకు ఆఫ్ బరోడా క్యాషియర్
ఈనెల 10 న డబ్బులు తీసుకొని బ్యాంక్ నుంచి వెళ్లిపోయిన ప్రవీణ్ గోవా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ కోసం పోలీసులు విస్తృతంగా గాలించారు. ఇవాళ అనూహ్యంగా కోర్టులో లొంగిపోయాడు. మరోవైపు ప్రవీణ్‌ను బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు సస్పెండ్ చేశారు.
వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా సాహెబ్ నగర్ శాఖలో రూ. 22.53 లక్షల నగదు తేడా వచ్చినట్లు మేనేజర్ వినయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం(మే 10న) మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రవీణ్ బ్యాంకు నుంచి వెళ్లిపోయాడని.... అతనిపైనే అనుమానం ఉందని వినయ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రవీణ్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫోన్ స్విచాఫ్ వచ్చినట్లు మేనేజర్ పోలీసులకు తెలిపారు. క్రికెట్, ఆన్లైన్ బెట్టింగ్‌లో డబ్బులు నష్టపోయినట్లు ప్రవీణ్, తన తల్లి చరవాణికి మంగళవారం రోజు సందేశం పంపినట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ డబ్బులు గెల్చిన తర్వాతే తిరిగి విధుల్లోకి వస్తానని తోటి సిబ్బందితో ప్రవీణ్ చెప్పినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బెట్టింగ్ కోసమే ప్రవీణ్ బ్యాంకు డబ్బులు వినియోగించాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరిపారు. ఇప్పుడు ప్రవీణ్ లొంగుబాటుతో ఈ విషయాల్లో స్పష్టత రానుంది.
ఇవీ చదవండి: