హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓ మహిళను ఇంట్లో బంధించి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 17న బాధిత మహిళను రాజమండ్రి నుంచి పొనుగొటి ఉదయభాను అనే వ్యక్తి తన ఇంటి పనుల కోసం నగరానికి తీసుకువచ్చాడు. అప్పటి నుంచి ఆమెను ఇంట్లోనే బంధించి శారీరకంగా చిత్ర హింసలకు గురిచేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు బయటకు వెళ్లిన సందర్భాల్లో బాధిత మహిళను ఇంట్లోనే ఉంచి బయట నుంచి తాళం వేసి వెళ్లేవాడని అన్నారు.
ఈ నెల 5వ తేదీన ఇంట్లో తాళం వేసి వ్యాపారం నిమిత్తం ఉదయభాను వేరే ప్రాంతానికి వెళ్లాడన్నారు. ఆ సమయంలో బాధితురాలు రాజమండ్రిలో ఉంటున్న తన కుమార్తెకు ఫోన్ చేసి పరిస్థితిని చెప్పడంతో... ఆమె తమకు సమాచారం అందించిందని బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు. వెంటనే బాధితురాలు ఉంటున్న ఇంటికి చేరుకుని ఆ మహిళను రక్షించినట్లు చెప్పారు. నిందితుడు ఉదయభానుపై అత్యాచారంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులకు పలు సంఘాలు మద్దతు