ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెదేపా మహిళా కార్పొరేటర్ అభ్యర్థిపై దాడి ఉద్రిక్తతకు దారి తీసింది. సన్నిహితులతో కలిసి ఇంటి ఇంటికి ప్రచారం చేస్తుండగా ఆమెపై దుండగలు దాడి చేశారు. వైకాపా కార్యకర్తలే తమపై దాడి చేశారని బాధితులు వాపోయారు. తెదేపా నేతలు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దాడి జరిగిన తీరును పరిశీలించారు.
దేవినేని అవినాష్‌కు వ్యతిరేకంగా పోటీ చేస్తే ఊరుకోమని హెచ్చరించటంతో పాటు తన కుమారుడిని కత్తితో పొడవబోతే స్థానికులు అడ్డుకున్నారని కొందపనేని వాణి విలపించారు. వైకాపా నాయకుల ఆగడాలకు ఈ ఘటనే నిదర్శనమని తెదేపా నాయకులు మండిపడ్డారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో పాటు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, తెలుగు యువత నేత దేవినేని చందు బాధితులకు మద్దతుగా నిలిచారు.
మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా
వాణిపై దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుచరులు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని లోకేశ్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. దాడికి సంబంధించిన వీడియోను లోకేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు
ఇదీ చదవండి: ప్రశాంతంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్