గుట్టు చప్పుడు కాకుండా నిషేధిత గ్లైసిల్ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 లక్షల 60 వేల రూపాయల విలువైన 180 కిలోల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. కుమురం భీం జిల్లా బెజ్జూరు మండలం అంబగట్ట గ్రామంలో నిషేధిత పత్తి విత్తనాలు అమ్ముతున్నారనే విశ్వసనీయ సమాచారంతో దాడులు నిర్వహించారు.
గ్రామానికి చెందిన మాడావి వెంకటేశ్, చాప్లే సత్తయ్య ఇళ్లలో సోదాలు చేపట్టగా గ్లైసిల్ విత్తనాలు లభించాయి. చింతలమనేపల్లి మండలానికి చెందిన కవ్వాల్ శ్రీనివాస్, డోకే శ్రీనివాస్, బెజ్జురు మండలానికి చెందిన కవ్వాల్ వెంకటేశ్ వద్ద వారు విత్తనాలు తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు పరారీలో ఉండగా.. ఇద్దరు నిందితులను స్థానిక పీఎస్లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ వెల్లడించారు.