Essential Precautions: సంక్రాంతి అంటేనే దాదాపు హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది. నగరంలో ఉండే వారు సొంతూళ్ల బాటపడతారు. మరికొందరు గ్రామాల్లో జరిగే వేడుకలు చూసేందుకు బంధువుల ఇళ్లకు వెళ్తుంటారు. పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారని... ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో నగరంలో ఇలాంటి దొంగలపై పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టారు. పాత నేరస్తులపై నిఘా ఉంచారు. గత కొన్నేళ్లుగా సంక్రాతి సమయంలో ఇతర రాష్ట్ర దొంగలు చోరీలకు పాల్పడుతుండటంలో పోలీసులు నిఘా పెంచారు. రాచకొండ, సైబరాబాద్ పరిధిలో ఎక్కువ శివారు ప్రాంతాలు ఉండటంతో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఇలా చేయండి..
హైదరాబాద్ పరిధిలో పాత నేరస్థులపై నిఘా పెట్టిన పోలీసులు... నగర వాసులకు పలు సూచనలు, హెచ్చరికలు జారీచేశారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. కొత్తవారి కదలికలపై సమాచారం అందించాలని తెలిపారు. కాలనీల్లో, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు శ్రేయస్కరమని సూచించారు. వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేసి.. ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలని కోరారు. ఎక్కువ రోజులు విహారయాత్రల్లో ఉంటే పేపర్, పాల వారిని రావద్దని చెప్పటంతో పాటు టైమర్‌తో కూడిన లైట్లను ఇంట్లో అమర్చుకోవాలన్నారు. ఊరికి వెళ్లే వారు ఇంటి వివరాలు అందిస్తే ఆ ప్రాంతంతో గస్తీకి ఏర్పాట్లు చేస్తామని పోలీసులు తెలిపారు.
కొత్తవారిపై నిఘా పెట్టాలి..
కాలనీల్లో కొత్తగా కనిపించే వారిపై నిఘా పెట్టాలన్న పోలీసులు.. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే సమాచారం ఇవ్వలన్నారు. కాలనీవాసులు కమిటీలు వేసుకొని వాచ్‌మెన్లను, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వాటిని స్థానిక పోలీస్ స్టేషన్లకు అనుసంధానిచటం ద్వారా నేరాలు నివారించవచ్చన్నారు.
ఇదీ చూడండి: