Anugrah stock broking cheating :షేర్ల క్రయవిక్రయాల్లో కళ్లుచెదిరే లాభాలిప్పిస్తామంటూ ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన అనుగ్రహ్ స్టాక్ అండ్ బ్రోకింగ్ సంస్థ హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో బాధితులను ముంచేసింది. కార్వీ తరహాలోనే అనుగ్రహ్ సంస్థ మదుపరులను మోసం చేసి రూ.వెయ్యికోట్లకు పైగా స్వాహా చేసిందని బాధితులు హైదరాబాద్ సెంట్రల్‌క్రైమ్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమతో రూ.1.87కోట్లు మదుపు చేయించి డీమ్యాట్ ఖాతాల్లోకి మార్పించి సంతకాలు చేయించుకుని ఖాతాలు ఖాళీ చేశారంటూ రెండు రోజులక్రితం చిక్కడపల్లికి చెందిన ప్రకాష్ ఫిర్యాదు చేశారు. కేవైసీ కిట్ ఇచ్చేప్పుడు పవర్‌ఆఫ్ అటార్నీ సంతకాలు చేయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మూడేళ్ల నుంచి డీమ్యాట్ ఖాతాల్లో మదుపు చేస్తున్నామని, ఆగస్టు, 2020లో నేషనల్ స్టాక్ ఎక్ఛ్సేంజి అనుగ్రహ్ ట్రేడింగ్ హక్కులను నిలిపివేసిందని, అప్పటి నుంచి డబ్బులు అడుగుతున్నా ఇవ్వడం లేదని ఆయన వివరించారు. మరోవైపు మదుపురులను మోసం చేశారన్న అభియోగాలపై అనుగ్రహ్ స్టాక్‌బ్రోకింగ్ యజమాని పరేష్ ఖరియాను గతేడాది జనవరిలో ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు.
తేజ్‌మండిడాట్ కామ్‌తో ప్రచారం....
స్టాక్‌మార్కెట్‌లో మదుపు చేస్తే రెట్టింపు లాభాలొస్తాయంటూ అనుగ్రహ్ స్టాక్ అండ్ బ్రోకింగ్ సంస్థ యజమాని కొన్నేళ్ల నుంచి తేజ్‌మండిడాట్ కామ్ వెబ్‌సైట్‌లో ప్రచారం చేయించాడు. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రకటనలు గుప్పించాడు. మదుపరులు కొన్న షేర్లకు లాభాలొచ్చాయని నమ్మించేందుకు తానే సొంతంగా డబ్బులు జమచేసేవాడు. వీటిని నిర్వహించేందుకు ఓమ్ శ్రీసాయి ఇన్వెస్ట్‌మెంట్స్ పేరుతో ఒక చిన్న కంపెనీని ప్రారంభించాడు. ఇందులోకి మదుపరుల సొమ్ము రూ.165.10కోట్లు మళ్లించాడు. ఈ అక్రమాలు గుర్తించిన సెబీ మార్చి, 2021లో అనుగ్రహ్ స్టాక్ అండ్ బ్రోకింగ్ కార్యకలాపాల్లోకి మళ్లించిన నగదును స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ఇప్పటి వరకు ఆ సంస్థలు మదుపరులకు న్యాయం చేయకపోవడంతో బాధితులు సెబీకి, పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.
ఇదీ చదవండి: చైన్ స్నాచింగ్ చేశారు.. నకిలీ కరెన్సీ బాగోతం బయటపడింది!