ACB Raids: అనిశా వలలో మరో అవినీతి చేప చిక్కింది. భూమి సర్వే విషయంలో ఓ వ్యక్తి నుంచి రూ. లక్ష లంచం తీసుకుంటుండగా తహసీల్దార్‌తో పాటు సీనియర్ అసిస్టెంట్, మరో ప్రైవేటు వ్యక్తిని అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం తహసీల్దారు పెరిమాళ్ల సంపత్ కుమార్‌ను.. ఓ వ్యక్తి అకెనపల్లి గ్రామ శివారులోని భూమిని హద్దులు చేసేందుకు ఆశ్రయించారు. దీనికి సంబంధించి రూ. 3 లక్షలు డిమాండ్ చేయడంతో మొదటగా లక్ష రూపాయలు ఇచ్చేందుకు శంకర్ గౌడ్ ఒప్పుకున్నారు. ఇదే క్రమంలో ఈ రోజు అనిశా అధికారులతో వచ్చిన ఆ వ్యక్తి.. తహసీల్దార్‌కు డబ్బులు ఇచ్చే విషయంలో సంప్రదించారు. ఆఫీసులో ఉన్న ఓ ప్రైవేటు వ్యక్తి లింగస్వామిని కలిసి ఆ డబ్బులివ్వాలని తహసీల్దారు చెప్పారు.
దీంతో లక్ష రూపాయలు నగదును లింగస్వామికి ఇచ్చారు. వెంటనే ఏసీబీ డీఎస్పీ రమణ మూర్తి అతడిని పట్టుకున్నారు. విచారణ అనంతరం తహసీల్దార్‌తో పాటు సీనియర్ అసిస్టెంట్ హజీమ్ హస్తం ఉన్నట్లు దర్యాప్తులో తేల్చారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని, నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి మంగళవారం.. కరీంనగర్ జైలు పంపిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
కాగా భూమి సర్వే విషయాల్లో రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే రూ. 3 లక్షలు డిమాండ్ చేశారని.. మొదటగా రూ. లక్ష ఆఫీసులోని అధికారులకు సంబంధించిన ప్రైవేటు వ్యక్తి.. తీసుకున్నట్లు బాధితుడు తెలిపారు. సర్వే విషయంలో తనను ఇబ్బందులకు గురి చేశారని బాధితుడు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ప్రభుత్వం లేఖ
సింహంతో ఆటలు.. కోపంతో గర్జిస్తున్నా టీజింగ్.. చేతి వేలు ఫసక్!