Palvancha Family Suicide: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఉదంతంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే సజీవదహనం కాగా.. చిన్న కుమార్తె సాహితీ మాత్రం తీవ్రగాయలతో బయటపడింది. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. రెండు రోజులుగా ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడి.. తన కుటుంబం వద్దకు వెళ్లిపోయింది.
ఏం జరిగిందంటే..
భద్రాద్రి కొత్తగూడెంలోని తూర్పుబజార్‌లో నివాసముంటున్న రామకృష్ణ... పాల్వంచలో మీ సేవా కేంద్రాన్ని నడిపారు. ఇటీవల ఇతరులకు లీజుకు ఇచ్చారు. అనంతరం రాజమహేంద్రవరానికి వెళ్లి రెండ్రోజుల క్రితం తిరిగి వచ్చారు. అనంతరం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దహనం కాగా.. చిన్న కుమార్తె తీవ్రగాయాలతో బయటపడింది. అప్పటి నుంచి చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం కన్నుమూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రామకృష్ణ కారులో పలు పత్రాలు, బిల్లులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ దొరకడంతో ఆత్మహత్యగా నిర్ధారించారు.
సూసైడ్ నోట్‌లో ఏముందంటే..
సూసైడ్ నోట్‌లో ఎమ్మెల్యే వనమా కుమారుడు రాఘవేందర్ పేరు ఉంది. అతనితో పాటు రామకృష్ణ తల్లి సూర్యవతి, అక్క మాధవి పేర్లు కూడా ఉన్నాయి. వనమా రాఘవేందర్‌కు రామకృష్ణ అక్క మాధవికి వివాహేతర సంబంధం ఉందని... వారివల్ల తనకు అన్యాయం జరుగుతోందని అందుకే... ఆత్మహత్య చేసుకున్నట్లు రామకృష్ణ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.
నాకేం సంబంధం లేదు..
రామృకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనపై వనమా రాఘవేందర్ స్పందించారు. పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యతో తనకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ఎటువంటి జోక్యం లేకున్నా తన పేరు ఎందుకు రాశారో అర్థం కావడం లేదని అన్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేక ఆత్మహత్య చేసుకుంటే తనకేం సంబంధమని ప్రశ్నించారు. ఘటనపై పూర్తి విచారణ చేయాలని కోరారు. తన ప్రమేయం ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పారు.
ఇవీ చదవండి: