గుంటూరు జిల్లా సత్తెనపల్లి నాగార్జుననగర్‌లో దారుణం చోటుచేసుకుంది. తల్లీకుమార్తెలను వారి బంధువు పాశవికంగా నరికి చంపాడు. అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. తల్లీ కుమార్తె ఇంట్లోనే రక్తపుమడుగులోనే విగతజీవులుగా పడిపోయారు. ఇళ్లంతా రక్తసిక్తంగా మారిపోయింది. రక్తపుమడుగులో అచేతనంగా పడి ఉన్న అమ్మను చూస్తూ...... కత్తిపోట్ల బాధను పంటిబిగువన భరిస్తూ యువతి తన సోదరుడికి ఫోన్ చేసి అప్రమత్తం చేసింది. ‘అన్నా.. అమ్మను, నన్ను శ్రీనివాస్ పొడిచాడు. అమ్మ చనిపోయింది. నువ్వు జాగ్రత్త..’ అన్న మాటలే ఆమె ఆఖరి పలుకులయ్యాయి. రక్తపుముద్దలా మారి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూసింది. శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అందిర్నీ ఉలిక్కిపడేలా చేసింది.
ఆస్తి వివాదమే కారణం
తల్లీకుమార్తెలను వారి బంధువే హతమార్చినట్లు డీఎస్పీ విజయభాస్కరరెడ్డి వెల్లడించారు. సత్తెనపల్లి మండలం కట్టమూరు వీఆర్వోగా పనిచేసిన కోనూరు శివప్రసాద్ నాలుగేళ్ల కిందట చనిపోయారని..... కారుణ్య నియామకం కింద ఆయన కుమారుడు లక్ష్మీనారాయణ గుంటూరు ఆర్డీవో కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నట్లు వివరించారు. తల్లి వెంకట సుగుణ పద్మావతితో కలిసి నాగార్జుననగర్‌లో ఉంటున్న లక్ష్మీనారాయణ..తన సోదరి లక్ష్మీప్రత్యూషకు పశ్చిమగోదావరి జిల్లా గణపవరానికి చెందిన సాయితేజస్వికి ఇచ్చి 5నెలల కిందటే వివాహం జరిపించారని తెలిపారు. ప్రస్తుతం గర్భిణి అయిన లక్ష్మీప్రత్యూష శ్రావణమాసం కావడంతో సారె కోసం తల్లిగారింటికి భర్తతో సహా వచ్చారని.. తిరిగి అల్లుడు ఒక్కరే స్వగ్రామానికి వెళ్లినట్లు వివరించారు. ఇంతలోనే ఈ దారుణ ఘటన చోటుచేసుకుందని తెలిపారు.
లొంగిపోయిన నిందితుడు..!
లక్ష్మీనారాయణ కుటుంబానికి, వారి పెదనాన్న మధుసూదనరావు కుటుంబాల మధ్య పొలం వివాదముందని పోలీసులు వెల్లడించారు. గుంటూరులో నివసిస్తున్న మధుసూదనరావు కుమారుడు శ్రీనివాసరావు శనివారం రాత్రి సత్తెనపల్లిలోని చిన్నమ్మ ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ సమయంలో లక్ష్మీనారాయణ ఇంట్లో లేరని..కోపోద్రేకంతో పద్మావతి, లక్ష్మీప్రత్యూషలపై శ్రీనివాసరావు కత్తితో అమానుషంగా దాడి చేయడంతో వారు అక్కడికక్కడే చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు పట్టణ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. దాడి సమయంలో సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన దృశ్యాలను పోలీసులు సేకరించారు.
ఇదీ చదవండి: CRIME: ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది.. చివరికి..!