ఐదేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ గుంటూరు జిల్లా పోక్సో కోర్డు న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి శుక్రవారం తీర్పు వెల్లడించారు. నేపాల్‌కు చెందిన ఓ దంపతులు బతుకుతెరువు కోసం గుంటూరు వచ్చి రైలుపేటలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. బాలికకు ఐదేళ్లు, బాలుడికు మూడేళ్లు. బాలిక తండ్రి థియేటర్ వద్ద నూడుల్స్ బండి పెట్టుకుని, తల్లి చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
వరంగల్ జిల్లా రఘునాథపల్లెకు చెందిన బలిదే వేణుగోపాల్ (40).. వీరి ఇంటికి సమీపంలో నివాసం ఉంటూ.. ఓ హోటల్ సప్లయర్‌గా పని చేస్తున్నాడు. అతడికి తన భార్యతో విబేధాలు రావడం వల్ల గుంటూరు వచ్చేశాడు. 2019 డిసెంబర్ 18న రాత్రి 10 గంటల సమయంలో తల్లిదండ్రులు ఎవరూలేని సమయం చూసి.. బాలికకు మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకువెళ్లాడు. చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాలిక ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లికి అనుమానం వచ్చి వెతుక్కుంటూ నిందితుడి ఇంటిలోపలకు వెళ్లగా.. బాలికను వదిలి నిందితుడు పారిపోయాడు. ఘటనపై బాలిక తల్లి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఛార్జ్ షీటు దాఖలు చేశారు. అతడిపై విచారణలో నేరం రుజువైన కారణంగా.. జీవిత ఖైదు, రూ.2500 జరిమానా విధిస్తూ జడ్జి శ్రీదేవి తీర్పు ఇచ్చారు. బాలికకు.. బాధిత నష్టపరిహార నిధి నుంచి ప్రభుత్వం రూ. లక్ష పరిహారం చెల్లించాలన్నారు.
ఇదీ చదవండి: ఎడ్లబండిని ఢీకొన్న టిప్పర్.. ఇద్దరు మృతి.