accident at Munagala: ఇంటికి తొందరగా వెళ్లొచ్చనే ఉద్దేశంతో రాంగ్‌రూట్‌లో పయనించడమే వారి పాలిట శాపమైంది. ఆ మార్గంలో వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో.. ఐదుగురి ఊపిరి గాల్లో కలిసింది. తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన.. సూర్యాపేట జిల్లా మునగాల శివారు జరిగింది. మునగాల మండల కేంద్రానికి చెందిన పలువురు సమీపంలోని సాగర్ ఎడమ కాలువ గట్టుపై ఉన్న అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం రాత్రి మహాపడి పూజకు హాజరయ్యారు.
వారిలో దాదాపు 38 మంది ట్రాక్టర్ ట్రాలీలో ఇళ్లకు తిరుగు ప్రయాణమయ్యారు. వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రాంగ్ రూట్‌లో వెళ్తుండగా.. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దుర్ఘటనలో చనిపోయిన మృతులను ఉదయ్‌లోకేశ్, తన్నీరు ప్రమీల, గండు జ్యోతి, చింతకాయల ప్రమీల, కోటయ్యగా గుర్తించారు. ప్రమాదస్థలి నుంచి క్షతగాత్రులను కోదాడ ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్ సరిపోలేదు.
అందుబాటులో ఉన్న వాహనాల్లో స్థానికులే కోదాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని ఖమ్మం, సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. రాంగ్‌రూట్‌లో వెళ్లడమే ప్రాణాల మీదకు తెచ్చిందని స్థానికులు అంటన్నారు. అయ్యప్పస్వామి పడిపూజకు తర్వాత ట్రాక్టర్‌లో 38 మంది గ్రామస్థులు మునగాలకు బయలుదేరారు. అయ్యప్ప ఆలయం నుంచి కిలోమీటరున్నర దూరంలో యూటర్న్ ఉంది.
కిలోమీటన్నర దూరాన్ని తగ్గించేందుకు ట్రాక్టర్ డ్రైవర్ రాంగ్‌రూట్ ఎంచుకున్నాడు. రాంగ్‌రూట్‌లో 200 మీటర్లు ప్రయాణిస్తే మునగాల చేరుకునే అవకాశముంది. రాంగ్‌రూట్‌లో వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించే అవకాశం లేక.. లారీ ఢీకొట్టడంతో దుర్ఘటన జరిగింది. లారీ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడు.
ఇవీ చదవండి: