యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో, ఇంట్లో గురువారం నుంచి జరిగిన సోదాల్లో సుమారు 77 లక్షల నగదు లభ్యమైంది. యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ ఇంటితో పాటు హైదరాబాద్ మేడిపల్లిలోని ఆయన నివాసంలో జరిగిన సోదాల్లో రూ. 76. 09 లక్షల నగదు, 27.03 గ్రాముల బంగారం, 7.09 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలతో పాటు 200 గజాల ప్లాట్ పేపర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ తెలిపారు. నిందితులిద్దరిని హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చామని వివరించారు.
అనిశా వలలో అవినీతి చేపలు
యాదగిరిగుట్ట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ వెంచర్ రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ దేవానంద్.. డాక్యుమెంట్ రైటర్ ద్వారా డబ్బులు డిమాండ్ చేశారు. రూ.20వేలు లంచం తీసుకుంటుండగా డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్, సబ్ రిజిస్ట్రార్ దేవానంద్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి పలు దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ దాడి సమయంలో కార్యాలయంలో ఉన్న ఉద్యోగులు బయటకు వెళ్లకుండా తలుపులు వేసి గురువారం సోదాలు కొనసాగించారు.
ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం లంచం డిమాండ్
ఆలేరు మండలం కొలనుపాక గ్రామ పరిధిలో గల సర్వే నంబరు 424,425,426,440 నందు గల 23 ఎకరాల 29 గుంటల వెంచర్ 2008లో వేశారు. స్విస్ లైఫ్ గ్రీన్ అవెన్యూలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం డాక్యుమెంట్ రైటర్ ప్రభాకర్ ద్వారా సబ్ రిజిస్ట్రార్ దేవానంద్ లంచం డిమాండ్ చేశారు. చివరికి రూ.20 వేలకు ఒప్పందం కుదుర్చుకుని రిజిస్ట్రేషన్ కోసం వెంచర్ యజమాని డాక్టర్ సత్యం ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పక్కా స్కెచ్ వేసిన అనిశా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా సబ్ రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్‌ను పట్టుకున్నారు. అలాగే హైదరాబాద్‌లోని సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు ఇవాళ సోదాలు నిర్వహించారు.
ఇదీ చదవండి: ACB caught Sub registrar: రూ.20 వేలు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన సబ్ రిజిస్ట్రార్