Chits Fraud in AP: అమాయకులకు చిట్టీల పేరుతో వల విసిరి వారి నుంచి రూ.20 కోట్ల వరకూ దండుకుంది ఏపీలోని అనంతపురానికి చెందిన ఓ మహిళ. చేసేది చిరు వ్యాపారం.. కానీ చిట్టీల పేరుతో కోట్లకు కోట్లు వసూలు చేసింది. మధ్యతరగతి మహిళలే లక్ష్యంగా చేసుకుని నిట్ట నిలువునా మోసం చేసిందని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.
అనంతపురం నగరంలోని విద్యుత్ నగర్‌కు చెందిన జయలక్ష్మి అనే మహిళ బ్యూటీపార్లర్ నడుపుతోంది. ఇరుగుపొరుగును మచ్చిక చేసుకుంటూ వారికి మాయమాటలు చెబుతూ చిట్టీలు వేయించింది. అలా అందరికీ నమ్మకం రావడంతో కూతురు పెళ్లికని ఒకరు.. కుమారుడి ఉన్నత చదువుల కోసమని మరొకరు.. సొంతిల్లు కట్టుకోవాలని ఇంకొందరు అమాయకులు జయలక్ష్మి దగ్గర చిట్టీలు వేశారు. ఇలా బాధితుల నుంచి దాదాపు 20 కోట్ల రూపాయలు వసూలు చేసుకుని ఉన్నపళంగా నిందితురాలు జయలక్ష్మి ఇంటిని ఖాళీ చేసి వెళ్తుండగా.. బాధితులు వెంబడించి ఎస్.కె.యూనివర్సిటీ వద్ద ఉన్న ఇటుకలపల్లి పోలీసు స్టేషన్లో అప్పగించారు.
కానీ ఎస్సై రాఘవరెడ్డి చిట్టీల నిర్వాహకురాలు జయలక్ష్మి వత్తాసు పలుకుతున్నారంటూ బాధిత మహిళలు ఆరోపించారు. ఎవరినడిగి చిట్టీలు వేశారంటూ తమపై తీవ్రస్థాయిలో మండిపడ్డారని ఎస్సైపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయండి అని అడిగితే ఎస్సై రాఘవరెడ్డి తమపై మండిపడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సై రాఘవరెడ్డి తీరుకు నిరసనగా స్టేషన్ ఎదుట మహిళలు బైఠాయించి ఆందోళన చేశారు.
100 మందికి పైనే..
పోలీస్‌స్టేషన్‌కు వచ్చాం. ఆమెను లోపల పెట్టారు. మేము నాలుగు గంటల నుంచి బయటే తిరుగుతూ ఉన్నాం. నా బిడ్డ బంగారం అమ్మి మరీ ఇచ్చాను. మొత్తం 16 లక్షలు ఆమెకు ఇచ్చాను. డబ్బులు రాకపోతే ఆత్మహత్యే శరణ్యం. మొత్తం 100 మందికి పైనే బాధితులు ఉన్నారు. పోలీసులు ఆమెకే వత్తాసు పలుకుతున్నారు. చాలా బాధగా ఉంది. -బాధిత మహిళ
ఇదీ చదవండి:
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!