Car fell into well in Siddipet: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ వద్ద బావిలో పడిన కారు ఘటనలో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. కారులో ఉన్న తల్లీకుమారుడి మృతితో వారి కుటుంబంలో.. కారును వెలికి తీసేందుకు చేపట్టిన సహాయక చర్యల్లో పాల్గొని మరణించిన గజఈతగాడి ఇంట్లో తీరని విషాదం నెలకొంది. శుభాకార్యం నుంచి వస్తుండగా ప్రమాదం జరగటం.. సహాయకచర్యల్లో పాల్గొనేందుకు సద్భావనతో వచ్చిన గజఈతగాడు కూడా మరణిచటం.. ఈ రెండు ఒకే ఘటనలో జరగటం అందరినీ కలచివేసింది.
car fell in well at chittapur: రామాయంపేట నుంచి సిద్దిపేట వెళ్లే ప్రధాన రహదారిలో చిట్టాపూర్, భూంపల్లి గ్రామాల మధ్యలో రోడ్డు పక్కన బావి ఉంది. మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామకు చెందిన తల్లీకుమారుడు వేడుకలో పాల్గొని హుస్నాబాద్‌కు కారులో వెళ్తున్నారు. అప్పటివరకు వాళ్ల ప్రయాణం బాగానే సాగినా.. చిట్టాపూర్, భూంపల్లి మధ్య కారు అదుపుతప్పింది. ఈ ఘటనలో ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి కారు దూసుకెళ్లింది. ఈ సన్నివేశాన్ని అక్కడే ఉన్న ఓ స్థానికుడు చూశాడు. రోడ్డు మీది నుంచి ఘటనా స్థలానికి వచ్చేలోపే కారు పూర్తిగా బావిలో మునిగిపోవటంతో ఏమీ చేయలేకపోయాడు. బావిలోనూ నిండుగా నీరు ఉండటం వల్ల అతడూ ఎలాంటి సాహసం చేయలేకపోయాడు. వెంటనే స్థానికులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు అంతా.. బావి దగ్గరికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు. జేసీబీ, క్రేన్ల సాయంతో కారును వెలికి తీసేందుకు అన్ని విధాల ప్రయత్నించారు. అప్పటికీ కారులో ఎంత మంది ఉన్నారో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. బావి లోతు సుమారు ఇరవై గజాలు.. నిండుగా నీరు ఉండటం వల్ల సహాయక చర్యలు కష్టంగా మారాయి. మోటార్ల సాయంతో బావిలోని నీటిని ఖాళీ చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు కూడా ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలించారు.
swimmer died in car in the well accident: ఈ సహాయక చర్యల్లో గజఈతగాళ్లు కూడా పాల్గొన్నారు. క్రేన్‌కు ఉన్న తాడుని బావిలోపల ఉన్న కారుకు కట్టి బయటకు తీసేందుకు ప్రయత్నం. ఈ క్రమంలో గజఈతగాళ్లు తీవ్రంగా శ్రమించారు. "మంచి చేయాలని వచ్చినా దురదృష్టం ముంచేసింది" అన్న సామెతా ఇక్కడ నిరూపితమైంది. కారును బయటకు తీసేందుకు వచ్చిన గజఈతగాళ్లలో ఒకరు సహాయకచర్యల్లో భాగంగా ప్రమాదవశాత్తు ప్రాణం వదిలాడు. గజఈతగాడైన నర్సింహులు.. బావిలోపలికి వెళ్లి కారుకు తాడు బిగించాడు. ఇక బయటికి లాగటమే తరువాయి. ఈ సమయంలోనే నర్సింహులు కారుకు చిక్కుకుపోయాడు. బయటికి వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా.. విఫలయత్నమే అయ్యింది. బయటివాళ్లకేమో.. నర్సింహులు పరిస్థితి తెలియదు.. అతడికేమో బయటికి రావటానికి వీలుకావటం లేదు. ఈ పోరాటంలో నర్సింహులు కూడా ప్రాణాలు వదిలాడు.
నర్సింహులు కట్టిన తాడుతో కారును ఎట్టకేలకు వెలికి తీశారు. కారుతో పాటు నర్సింహులు విగతజీవిగా బయటికి వచ్చాడు. కారు లోపల తల్లీకుమారుడి మృతదేహాలను గుర్తించారు. చాలా మంది.. చాలా సేపు శ్రమించగా.. అందులో ఉన్న ఇద్దరి ప్రాణాలతో పాటు మరొకరు బలైన తర్వాతే.. కారు బయటపడింది. ఈ ఘటన అందరి హృదయాలను కలచివేసింది.
ఇదీ చూడండి: