వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి శివారులోని బిట్స్(Balaji Institute of Technology and Science- BITS)లో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పాలిటెక్నిక్ చదువుతున్న ఐదుగురు విదార్థుల మధ్య శుక్రవారం రాత్రి వసతి గృహంలో గొడవ జరిగింది. ఇందులో హనుమకొండ జిల్లా కమలాపురం మండలానికి చెందిన విద్యార్థి సంజయ్ కుమార్(17).. వసతి గృహం రెండో అంతస్తు నుంచి కిందపడిపోయాడు. సంజయ్ పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఘర్షణలో అతను తీవ్రంగా గాయపడ్డాడు.
గమనించిన సిబ్బంది, తోటి విద్యార్థులు.. క్షతగాత్రుడిని హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సంజయ్ మృతి చెందాడు. విద్యార్థి మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తమ కుమారుడు చనిపోయాడని సంజయ్ తల్లిదండ్రులు.. ఎంజీఎం ఎదుట ఆందోళన చేపట్టారు.
గొడవ జరిగిందా.. లేదా.?
సంజయ్ కుమార్‌తో పాటు వసతిగృహం గదిలో విద్యార్థులు హరిరాజు, శివసాయి, మనోహర్, కృష్ణంరాజు ఉన్నారు. రాత్రి భోజన సమయంలో కింద ఉన్న డైనింగ్ హాల్లో హాస్టల్ విద్యార్థులంతా భోజనం చేస్తుండగా రెండో అంతస్తు నుంచి సంజయ్ కింద పడ్డాడు. ఆ సమయంలో అన్నం వడ్డిస్తున్న వార్డెన్‌తో పాటు మరో మహిళ ఏం జరిగిందని విద్యార్థులను అడిగారు. దుప్పటి జారి కింద పడ్డాడని వారు చెప్పడంతో క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించినట్లుగా హాస్టల్ వార్డెన్ తెలిపారు.
విద్యార్థులకు అన్నం వడ్డిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పైన ఏం జరిగిందో తెలియదు. వెంటనే సంజయ్‌ను ఆస్పత్రికి తరలించాం. గొడవ జరిగిందా.. జారి పడ్డాడా అనే విషయం మాకు స్పష్టంగా తెలియదు. -ధనలక్ష్మీ, వంట మనిషి
సంజయ్ మృతదేహంపై గాయాలు ఉండటంతో విద్యార్థుల మధ్య ఘర్షణ వల్లనే కింద పడి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కళాశాల వద్ద ఎలాంటి ఘర్షణ జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: చెరువులో తల్లీకుమార్తె మృతదేహాలు.. హత్యా.. ఆత్మహత్యా?