Priest attack on a devotee: గత రెండు రోజుల క్రితం సాయంత్రం సమయంలో సికింద్రాబాద్‌లోని గణేష్ దేవాలయ దర్శనం కోసం ఉప్పల్ బాలాజీహిల్స్‌కు చెందిన వాల్మీకిరావు వచ్చారు. ప్రధాన ఆలయంలో దర్శనం చేసుకున్న అనంతరం పక్కనే ఉన్న ఉప ఆలయాలను దర్శించుకుంటున్న సమయంలో అనుమతి లేకుండా ఆ గుడి లోపలికి ఎలా వెళ్తావని పూజారి ప్రభాకర్ శర్మకు, భక్తుడికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
దాడి చేయడమే కాకుండా..
అదే సమయంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో ఆగ్రహానికి లోనైన పూజారి వాల్మీకిరావుపై విచక్షణా రహితంగా ఆలయంలోనే దాడి చేశాడు. ఒక్కసారిగా అర్చకుడు ప్రభాకర్ శర్మ దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాడి చేయడమే కాకుండా భక్తుడిని బెదిరిస్తున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. వెంటనే వాల్మీకిరావు గోపాలపురం పీఎస్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
దేవాదాయశాఖ కమిషనర్ దృష్టికి..
ఆలయంలో దర్శనం కోసం వెళ్లిన తనపై రౌడీల మాదిరిగా పూజారి దాడికి పాల్పడడం ఎంత వరకు సమంజసమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అకారణంగా దాడికి పాల్పడ్డ ఆలయ పండితుడు ప్రభాకర్‌శర్మపై చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను కోరారు. దేవాదాయశాఖ కమిషనర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి పూజారిపై చర్యలు తీసుకునే విధంగా చూస్తామని దేవాలయ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే అతనికి మెమోలు జారీ చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: CJI at tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ