Woman, 3 kids jump into canal: కుటుంబ కలహాలతో విసిగిన ఓ మహిళ ముగ్గురు పిల్లలతో సహా జూరాల ప్రధాన కాల్వలో దూకిన ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరులో చోటుచేసుకుంది. ఇందులో ఓ బాలుడిని స్థానిక యువకుడు రక్షించగా మిగతా ముగ్గురు మాత్రం గల్లంతయ్యారు. పెబ్బేరు ఎస్సై రామస్వామి, స్థానికుల కథనం ప్రకారం.. పెబ్బేరు పట్టణానికి చెందిన డీసీఎం డ్రైవర్ తెలుగు స్వామి, భవ్య పదేళ్ల కిందట ప్రేమించుకొని కులాంతర వివాహం చేసుకొన్నారు. వీరికి అయిదేళ్ల జ్ఞానేశ్వరి, మూడేళ్ల వరుణ్, ఏడాది వయస్సున్న నిహారిక సంతానం. కొన్ని రోజులుగా కుటుంబ సమస్యలతో భార్యాభర్తలు నిత్యం గొడవ పడుతున్నారు. ఆదివారం కూడా గొడవలు జరగడంతో మనస్తాపానికి గురైన భవ్య ముగ్గురు పిల్లలను తీసుకొని రాత్రి 7.30 గంటల సమయంలో పట్టణ సమీపంలో ఉన్న జూరాల ఎడమ ప్రధాన కాల్వలో దూకింది. స్థానికులు గమనించి కేకలు వేయగా, అటువైపు వెళ్తున్న కుమార్ అనే యువకుడు మూడేళ్ల వరుణ్‌ని కాపాడారు. తల్లి, ఇద్దరు కుమార్తెలు మాత్రం గల్లంతయ్యారు. విషయం తెలిసి ఎస్సై సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. వెంటనే రామన్‌పాడు జలాశయం అధికారులతో మాట్లాడి కాల్వకు నీటి విడుదల నిలిపి వేయించి గాలింపు చర్యలను వేగవంతం చేశారు.
ఆదివారం వారు ఆత్మహత్య చేసుకోగా.. సోమవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తల్లి భవ్య, కూతుర్లు నిహారిక, జ్ఞానేశ్వరిల మృతదేహాలు లభ్యమయ్యాయి. తల్లి భవ్య, చిన్నకూతురి మృతదేహాలు ఆత్మహత్య చేసుకున్న చోటు నుంచి వంద మీటర్ల దూరంలో లభ్యం కాగా.. పెద్ద కూతురు జ్ఞానేశ్వరి మృతదేహం వీపనగండ్ల మండలం సమీపంలోని గోపాల్ దిన్నె రిజర్వాయర్ వద్ద లభ్యమైనట్లు ఎస్సై పేర్కొన్నారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని పెబ్బేరు ఎస్సై రామస్వామి తెలిపారు.
ఇదీ చదవండి: