కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన ఓ వ్యక్తి.. కుటుంబ పోషణ భారమై పురుగుల మందు తాగి బలవన్మరణాలకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన.. నల్గొండ జిల్లా కనగల్ మండలంలో చోటు చేసుకుంది. పగిడిమర్రి గ్రామానికి చెందిన నవీన్ కుమార్(30) జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో బస్ డ్రైవర్గా పని చేసేవాడు. కొవిడ్ రెండో దశ నేపథ్యంలో పాఠశాల మూతపడటంతో మూడు నెలలుగా జీతాలు లేక.. అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. పట్టణంలో పూట గడవక.. సొంతూరుకు మకాం మార్చాడు.
నమ్ముకున్న వ్యవసాయం కూడా..
నవీన్ కుమార్.. తనకున్న రెండున్నర ఎకరాల్లో పంట సాగు చేశాడు. దురదృష్టవశాత్తు పంటకు తెగులు పట్టి.. దిగుబడి రాలేదు. దీంతో కుటుంబ పోషణ మరింత భారంగా మారింది. జీవితం మీద విరక్తి చెంది.. పురుగుల మందు తాగి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి ఆరు నెలల క్రితమే పెళ్లైనట్లు అతడి తల్లి చెప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: వీడియో వైరల్: సింగిల్ విండో ఛైర్మన్ లంచం డిమాండ్