హైదరాబాద్ జవహర్‌నగర్ ఠాణా పరిధిలోని యాప్రాల్‌లో ఇంట్లో పూల కుండీల్లో (Ganja Cultivation in House) గంజాయి మొక్కలను పెంచుతూ ఆదివారం పిల్లోట్ల వెంకటనర్సింహాశాస్త్రి(53) పోలీసులకు చిక్కిన సంగతి విదితమే. విచారణలో అతను చెప్పిన సమాధానాలు దర్యాప్తు అధికారులు కంగుతిన్నారు.
‘ప్రశాంతంగా నిద్ర పోయేందుకే గంజాయి సేవించేవాడిని. అదీ కూడా రాత్రి భోజనం చేసిన తర్వాతే. నా బేకరీకొచ్చే ఓ వినియోగదారుడు చెబితేనే దీన్ని అలవాటు చేసుకున్నా’ అని పోలీసులకు వివరించాడు. ‘అప్పుడప్పుడు కొనుగోలు చేసిన గంజాయిలో అయిదారు విత్తనాలు కనిపిస్తే దాచి పెట్టా. జులైలో మొదటి విత్తనం పెట్టా. అది మొలిచింది. దీంతో మిగిలిన వాటిని సెప్టెంబర్‌లో నాటాను. ఇంకో 15, 20 రోజులైతే పంట చేతికొచ్చేది. ఎవరికీ అమ్మాలనుకోలేదు. ఒకరిద్దరు స్నేహితులకు మాత్రం బహుమతిగా ఇవ్వాలనుకున్నా’ అని వివరించడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.
ఈ ఘటన ఎలా వెలుగులోకి వచ్చిందంటే?
యాప్రల్లోని ఓ ఇంట్లో గంజాయి మొక్కలు పెంచడం కలకలం రేపింది. గోదావరి గార్డెన్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి మొక్కలను పెంచుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి మొక్కలు పెంచుతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఏడు పెద్ద కుండీల్లో పెంచుతోన్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గత కొంత కాలంగా గంజాయి మొక్కలను పెంచుతూ.. స్థానికంగా యువతను లక్ష్యంగా చేసుకొని విక్రయాలు సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అల్వాల్ డిప్యూటీ ఎమ్మార్వో, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సమక్షంలో పంచనామా నిర్వహించారు. మొక్కలను సీజ్ చేసి నిందితులను జవహార్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చూడండి: గంజాయి మొక్కల కలకలం.. గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే పెంపకం..