మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం వెల్కిచర్లలో ప్రభుత్వ భూమికి సంబంధించిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. వెల్కిచర్ల గ్రామంలో మహబూబ్నగర్-శ్రీశైలం ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న భూమిని తమకు కేటాయించారని, అందులో గుడిసెలు వేస్తే తొలగించారని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన ఎస్సీ కుటుంబాలు ఆందోళనకు దిగాయి. రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టాయి. సుమారు రెండున్నర గంటల పాటు ఆందోళన కొనసాగటంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమించే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో స్వామి అనే యువకుడు ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్య(Suicide) చేసుకుంటానంటూ.. ఆందోళనకు దిగాడు. రాతపూర్వకంగా ఫిర్యాదు ఇస్తే విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు. వెల్కిచర్ల ప్రధాన రహదారికి ఆనుకుని పట్టాభూమి, గ్రామకంఠం భూమి ఉంది. గ్రామకంఠం భూమిని గతంలో ఎస్సీలకు కేటాయించారని, అందులో గుడిసెలు వేసుకునేందుకు వెళ్తే తొలగిస్తున్నారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలో పట్టాభూములు, గ్రామకంఠం భూములకు గతంలో సరిహద్దులు నిర్ణయించారు. పట్టాభూముల్లో ఎస్సీ కుటుంబాలు గుడిసెలు వేయడంతో పట్టాదారుడు వాటిని తొలగించారు. దీంతో వివాదం చెలరేగి, ఆందోళనకు దారితీసింది.
ఇదీ చదవండి: Camera in Bathroom case: బాత్రూమ్లో కెమెరా కేసు.. మ్యాటర్ సెటిల్ చేస్తానంటూ మధ్యవర్తి