A Man Killed Younger Brother In NTR District: ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో తల్లిని తిట్టాడని తమ్ముడిని అన్న కత్తితో పొడిచాడు. ప్రసన్నకుమార్, కరుణ కుమార్ అనే అన్నదమ్ములు రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్లారు. రోజు తాగి వస్తున్నారెందుకని తల్లి ప్రశ్నించింది. డబ్బులు, ఆరోగ్యం నాశనం చేసుకుంటున్నారని ఆగ్రహించింది.
"మా ఇష్టం తాగుతాం" అంటూ చిన్న కొడుకు కరుణ కుమార్ తల్లిని పరుషంగా మాట్లాడడంతో ప్రసన్న కుమార్ జోక్యం చేసుకోవడంతో, అతడిని కూడా దూషించాడు. ప్రసన్నకుమార్ క్షణికావేశంలో "నిన్ను చంపేస్తా.." అంటూ వంటగదిలో కూరగాయలు కోసే కత్తి తీసుకు వచ్చి కరుణ కుమార్ని ఎడమ వైపు ఛాతీలో, డొక్కలో పొడిచాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన కరుణ కుమార్ని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. తండ్రి నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు ప్రసన్న కుమార్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఇవీ చదవండి :