Boy died in Monkeys Attack in Medak మెదక్ జిల్లా నర్సాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. కోతులు వెంబడించడంతో నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి కిందపడిన 9 ఏళ్ల మానసిక దివ్యాంగ బాలుడు మణికంఠ సాయి మృతి చెందాడు. శివాలయం వీధిలో నివాసం ఉండే కస్తూరి యశోద భవన నిర్మాణ కార్మికురాలిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈమెకు ఓ కుమారుడు మణికంఠ సాయి ఉన్నాడు. ఇతడికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో.. కూలీ పనులకు వెళ్లే సమయంలో తల్లి తన వెంట తీసుకుకెళ్తుండేది.
ఎప్పటి మాదిరిగానే శనివారం నర్సాపూర్‌లోని ఓ ఇంటి నిర్మాణ పనులకు యశోద వెళ్లింది. అక్కడ మొదటి అంతస్తులో ఆమె పనులు చేస్తుండగా సమీపంలో ఆడుకుంటున్న మణికంఠ సాయిపైకి కోతుల గుంపు దాడి చేసింది. దీంతో భయపడ్డ మణికంఠ కింద పడిపోగా రాయి తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతణ్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి.. అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందతూ ఆ బాలుడు.. అదే రోజు అర్ధరాత్రి మృత్యువాతపడ్డాడు.
మణికంఠ తండ్రి దత్తు ఏడాది కిందట ఇదే నెలలో 25న చనిపోయాడు. మరో 3 రోజుల్లో తండ్రి సంవత్సరికం ఉండగా.. అంతలోనే ఇలా కావడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కోతుల కారణంగా తరచూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నామని.. ఇకనైనా ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించాలని పట్టణవాసులు కోరుతున్నారు.