సిరిసిల్ల వేములవాడ రాజన్న ఆలయం వద్ద శిశువు కిడ్నాప్ కథ సుఖాంతమైంది. ఇవాళ ఉదయం అపహరణకు గురైన శిశువును పోలీసులు గుర్తించారు. వరంగల్ రైల్వేస్టేషన్లో నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులు అపహరణకు గురైన కొన్ని గంటల్లోనే ఈ కేసును ఛేదించారు.
కరీంనగర్‌కు చెందిన లావణ్య అనే మహిళ నాలుగు రోజులుగా తన ఇద్దరు పిల్లలతో ఆలయం మెట్ల వద్ద ఉంటోంది. రాత్రి సమయంలో లావణ్య ఆలయ పరిసరాల్లో నిద్రిస్తుండగా ఓ మహిళ శిశువును అపహరించింది. అపహరణకు ముందు లావణ్యకు మద్యం తాగించారు. ఆమె నిద్రమత్తులోకి వెళ్లగానే శిశువును అపహరకించారు. కుటుంబ కలహాలతో లావణ్యను భర్త వదిలేసి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టి చిన్నారిని కాపాడారు. చిన్నారిని, నిందితులను వేములవాడ తీసుకొస్తున్నారు.
లావణ్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారి ఆచూకీ కనిపెట్టేందుకు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. ఆలయ మెట్ల వద్ద నిద్రించిన వారిని ఆరా తీయగా.. కొందరు తాము తిరుపతి వెళ్తున్నట్లు మాట్లాడుకుంటుంటే విన్నామని పలువురు చెప్పారు. వారి సమాచారంతో పోలీసులు తిరుపతి వెళ్లే బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో గాలింపు మొదలుపెట్టారు. ఆ మార్గాల్లో సీసీటీవీ ఫుటేజీ కూడా పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో వరంగల్ రైల్వే స్టేషన్‌లో చిన్నారిని అపహరించిన ఇద్దరిని పట్టుకుని శిశువును రక్షించారు. నిందితులను మొదట వరంగల్‌లోని ఇంతెజార్‌గంజ్ పీఎస్‌కు తరలించిన పోలీసులు వేములవాడకు తరలిస్తున్నారు.
ఇవీ చూడండి: బర్త్‌డే పేరుతో.. 12 ఏళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో పెళ్లి