ఖమ్మం డీసీసీబీలో భారీగా అక్రమాలు జరిగినట్లు సహకారశాఖ తేల్చింది. బ్యాంకు తాజా మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబు, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) వసంతరావు కారణంగా రూ.7.32 కోట్లు దుర్వినియోగమైనట్లు తేల్చింది.. ఆ మొత్తాన్ని వారిద్దరి నుంచి వసూలు చేయడానికి, అవసరమైతే ఆస్తులు స్వాధీనం చేసుకోడానికి సహకార శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సహకార చట్టం సెక్షన్ 60 ప్రకారం ఆస్తుల స్వాధీనానికి త్వరలో నోడల్ అధికారిని నియమించబోతోంది. సహకార సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతులను మోసం చేసి వివిధ పేర్లతో వారి నుంచి సొమ్ము వసూలు చేసి ఇష్టారీతిగా ఖర్చు చేయడానికి మాజీ ఛైర్మన్, సీఈఓలే కారణమని విచారణలో తేలింది. అప్పటి బ్యాంకు డైరెక్టర్లపైనా చర్యలు తీసుకోవాలని సూచించింది.
అసలేం జరిగిందంటే..
ఖమ్మం డీసీసీబీకి ఛైర్మన్‌గా పనిచేసిన మువ్వా విజయబాబు, సీఈఓ వసంతరావు కుమ్మక్కై పలు అక్రమాలకు పాల్పడ్డారని 2018లో ప్రభుత్వానికి ఫిర్యాదులొచ్చాయి. అదనపు రిజిస్ట్రార్ సుమిత్రను సహకార శాఖ విచారణ అధికారిగా నియమించింది. 2019 డిసెంబరు 13న సుమిత్ర విచారణ నివేదికను సహకార రిజిస్ట్రార్‌కు, ప్రభుత్వానికి అందజేశారు. కానీ అప్పట్లో ఓ ప్రముఖ నేత ఈ నివేదిక బయటకు రాకుండా ఒత్తిడి తెచ్చి ఆపివేయించారు. ఇటీవల కొత్త పాలకవర్గం రావడంతో విచారణ నివేదికను ఇవ్వాలని కోరింది. దీనికితోడు ఇప్పుడు మరో కీలకనేత అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. దీంతొ ఎట్టకేలకు సహకార శాఖ విచారణ నివేదికను డీసీసీబీకి పంపింది.
అవినీతికి ఎలా పాల్పడ్డారంటే..
- అప్పటి ఛైర్మన్ తనకు కావాల్సిన వారికి రుణాలిప్పించారు. వారు కట్టకపోవడంతో ఎగవేతదారుల జాబితా పెరిగిపోయింది.
- పాలకవర్గం అధ్యయన యాత్రలకు వెళ్లడానికి రూ. 59.98 లక్షలు ఖర్చుపెట్టి రికార్డుల్లో రాయలేదు.
- పాలకవర్గం సభ్యులకు, ప్యాక్స్ ఛైర్మన్లకు, ఉద్యోగులకు బహుమతులు ఇవ్వడానికి రూ. 63.15 లక్షలు వాడుకున్నారు.
- ఒక ట్రస్ట్‌ను ఏర్పాటుచేసి.. రైతులు మరణిస్తే వారి కుటుంబాలకు దాని ద్వారా సాయం చేస్తామన్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం.
- కనీస పరిజ్ఞానం లేనివారితో ట్రస్ట్ ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటుచేశారు. ఇందుకు రైతులకిచ్చిన పంటరుణాల నుంచి సొమ్మును తిరిగి వసూలుచేశారు. ఇది రూ. 6.13 కోట్లకు చేరింది. పాత పాలకవర్గం పదవీకాలం ముగిశాక, ఆస్పత్రిపై, దానికి వెచ్చించిన నిధులపై ఎవరికీ బాధ్యత లేకుండా పోయింది. ఆ తరవాత దాన్ని ఓ ప్రైవేటు సంస్థకు లీజుకిచ్చారు.
- మొత్తం రూ. 7.32 కోట్లకు పైగా సొమ్మును దుర్వినియోగం చేసినట్లు తేలింది. ఇదంతా అప్పటి ఛైర్మన్, సీఈఓ, 20 మంది డైరెక్టర్ల నుంచి వసూలు చేయాలని నివేదిక సిఫార్సు చేసింది.
ఇదీ చదవండి : మరో పదిరోజుల పాటు సాగునీరు అందించాలి: కేసీఆర్