తోడబుట్టిన తమ్ముడే అన్నపాలిట యముడైయ్యాడు. వదిన, ఇతర కుటుంబసభ్యులపైనా దాడికి తెగబడి హతమార్చాడు. వరంగల్ ఎల్బీనగర్‌లో సంచలనం సృష్టించిన మూడు హత్యల కేసుకు సంబంధించి కీలక నిందితుడు షఫీతో పాటు...మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. అన్నదమ్ములైన చాంద్ పాషా, షఫీలు పరకాల, జంగాలపల్లి, ఏటూరునాగారం ప్రాంతాల్లో పశువులను కొనుగోలు చేసి వాటిని హైదరాబాద్ కబేళాలకు తరలించే వ్యాపారం 30 ఏళ్లుగా చేస్తున్నారు. అయితే రెండేళ్లుగా ఈ వ్యాపారంలో నష్టాలు రావడం.. ...ఇద్దరి మధ్యా విభేదాలు తెచ్చింది. లాభాల్లోనూ అన్నే ఎక్కువ తీసుకున్నాడని...తనకున్న అప్పులు చెల్లించి.. తన వాటా డబ్బులు ఇవ్వాలంటూ.. షఫీ అన్న చాంద్ పాషాని ఒత్తిడి చేయసాగాడు. పాషా అందుకు నిరాకరించడంతో.... అన్నను హతమార్చాలని షఫీ నిర్ణయించుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ వెల్లడించారు.
పక్కా ప్లాన్ ప్రకారమే..
15 రోజుల ముందుగానే అన్నను...కుటుంబ సభ్యులను చంపేందుకు షఫీ పక్కాగా ప్లాన్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతకుముందు రోజు సాయంత్రం 6 గంటలకు స్నేహితులను ఇంటికి పిలిచి... హత్యలకు పథక రచన చేశాడని.. సీపీ చెప్పారు. తమని గుర్తుపట్టకుండా ఉండేందుకు నిందితులు వ్యూహం పన్నారని పోలీసులు వెల్లడించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు... నిందితులను 24 గంటల్లోనే పట్టుకున్నారు. ఆధారాలు సేకరించి కేసు రీకన్‌స్ట్రక్ట్ చేసి... నిర్ధరించుకున్నారు. గతంలో షఫీపై మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో కేసు ఉన్నట్లు సీపీ తెలిపారు.
సుపారీ ప్రమేయమే లేదు...
ఈ కేసులో సుపారీ ప్రమేయాన్ని... సీపీ తోసిపుచ్చారు. హతమార్చిన తర్వాత నిందితులంతా షఫీ ఇంటికి వచ్చి... అరగంట సేపు ఉండి దుస్తులు మార్చుకున్నారని కొన్ని ఆధారాలు దొరక్కుండా చేసేందుకు ప్రయత్నించారని సీపీ చెప్పారు. మూడు హత్యల్లో పాల్గొన్నది షఫీతో కలిపి మొత్తం ఆరుగురేనని... ఇతరుల ప్రమేయం లేదని సీపీ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:
Warangal Murders: అన్న కుటుంబంపై కత్తులతో తమ్ముడి దాడి.. ముగ్గురి మృతి