Heart Attack While Driving: ట్రాక్టర్ డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో ముగ్గురు చనిపోయిన దుర్ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిన్నంబావి వద్ద చోటుచేసుకుంది. శేరిగూడెంలో ఇటుకలను అన్లోడ్ చేసి వస్తుండగా ట్రాక్టర్ డ్రైవర్ ఎల్లయ్యకు గుండెపోటు రావడంతో డ్రైవింగ్ సీటులో అక్కడికక్కడే మృతి చెందాడు. పక్కన ఇంజిన్‌పై కూర్చున్న వారికి ఏం చేయాలో తోచలేదు. డ్రైవర్ చనిపోయి స్టీరింగ్‌పై పడిపోవడంతో ట్రాక్టర్ నియంత్రణ కోల్పోయి పక్కన ఉన్న గుంటలోకి దూసుకెళ్లింది. ఆ గుంటలోనే ట్రాక్టర్ పల్టీ కొట్టడంతో ఇంజిన్‌పై కూర్చున్న సీతారాం, దుర్గ అనే ఇద్దరు కూలీలు కూడా అక్కడికక్కడే చనిపోయారు.
ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను చౌటుప్పల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇటుకల బట్టీలో కూలీలుగా పని చేస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తమకు న్యాయం చేయాలని మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. పొట్టచేత పట్టుకుని పనికోసం ఇంతదూరం వచ్చామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటుకలు అన్లోడ్ చేసి వచ్చేటప్పుడు సీట్లోనే ఎల్లయ్య పడిపోయాడు. వెంటనే ఆయనను బాబాయి అని పిలిచాను. కానీ ఇంతలోనే ట్రాక్టర్ గుంతలోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. మాలో ముగ్గురికి గాయాలయ్యాయి. నేను ప్రాణాలతో బయటపడ్డాను. బాబాయితో పాటు మరో ఇద్దరు చనిపోయారు. -ప్రమాదంలో గాయపడిన వ్యక్తి
ఇటుకలను అన్లోడ్ చేసి వస్తుండగా డ్రైవర్ స్పృహ తప్పిపడిపోవడంతో ట్రాక్టర్ అదుపుతప్పి గుంటలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు సీతారాం, దుర్గ అనే కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. మృతుల మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశాం. -పోలీసు అధికారి
ఇదీ చదవండి: