Ganja seized: పోలీసులు గంజాయి రవాణాపై కఠిన చర్యలు చేపట్టినప్పటికీ అక్రమ రవాణాకు అడ్డుకట్టపడటంలేదు. సూర్యాపేట జిల్లాతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు గంజాయి చీకటి దందాలో కోరియర్లుగా కీలకంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా నుంచి హైద్రాబాద్ వంటి నగరాలకు చేరవేస్తున్నారు. దొరికినప్పుడు మాత్రమే దొంగలుగా పట్టుబడుతున్నారు.
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు అంతరాష్ట్ర ముఠా సభ్యులనుసూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 15 కిలోల గంజాయి రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించిన వివరాలను సూర్యాపేట ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు.
ఏపీ విశాఖపట్నం జిల్లా కొత్తవలస మండలం డంబ్రీగూడకు చెందిన ప్రభుదాస్ గంజాయిని కొనుగోలు చేసి ఏజెంట్ల ద్వారా గుట్టుగా వినియోగదారులకు సరఫరా చేస్తున్నారని ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అందులో భాగంగా గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్న సూర్యాపేటకు చెందిన కొల్లు సాయి కిరణ్ , కోలా మణికంఠలతో అతనికి పరిచయం ఏర్పడింది. వారు గంజాయి కావాలని ప్రభుదాస్ని అడిగారు.
వారికి గంజాయి అందజేసేందుకు విశాఖ ఏజెన్సీ నుంచి సూర్యాపేటకు వస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. డీఎస్పీ మోహన్ కుమార్ నేతృత్వంలోని రెండు బృందాలు నిఘా పెట్టాయన్నారు. ద్విచక్రవాహనంపై వచ్చిన ప్రభుదాస్ సాయి కిరణ్, మణికంఠలకు అందిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలియచేశారు.
ఇదీ చదవండి: Councilor murder case: పక్కా ప్లాన్ ప్రకారమే హత్య.. పాతకక్షలే కారణం: ఎస్పీ