అమ్మ, అర్ధాంగి.. అండగా...
కొవిడ్ వచ్చిన తమ పిల్లలకు అమ్మే అన్నీ తానై సపర్యలు చేసి వాళ్లు కోలుకునేలా చేస్తోంది. ఇక భార్యలు తమ భర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. వైరస్ బారిన పడ్డ వారిలో ఎక్కువ సంఖ్యలో హోం ఐసోలేషన్‌లో ఉంటూ మందులు వాడుతున్నారు. పైగా రెండో వేవ్‌లో ఇంట్లో ఒకరికి వైరస్ సోకితే ఇంటిల్లిపాదికీ వ్యాపిస్తోంది. ఈ క్రమంలో అందరూ పాజిటివ్‌తో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నా అమ్మ, ఆలి మాత్రం అలసట లేకుండా అందరికీ వండి పెడుతున్నారు. వేళకు గోలీలు వేసుకునేలా చొరవ చూపుతున్నారు. ధైర్యం నూరి పోస్తూ కొండంత అండగా ఉంటున్నారు.
‘ఆశా’దీపాలు...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జ్వర సర్వేలోనూ ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలే కీలకంగా పనిచేస్తున్నారు. ఆరు జిల్లాల పరిధిలో దాదాపు పది వేలకుపైగా మహిళా సిబ్బంది ఇంటింటికీ తిరిగి జ్వర బాధితులను గుర్తించి వారికి మందుల కిట్లు అందజేశారు. పీహెచ్‌సీ కేంద్రాల్లో ర్యాపిడ్ పరీక్షల్లో అనుమానితుల నుంచి నమూనాలు సేకరించే వారిలో కూడా 80 శాతానికి పైగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మహిళలే ఉన్నారు.
ప్రాణం పోస్తున్నారు
కొవిడ్ విజృంభించే కొద్దీ ఆసుపత్రుల్లో పడకలు నిండుతూ, ఆక్సిజన్ అవసరమయ్యే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలో మహిళా వైద్యులు, నర్సుల సేవలు కీలకంగా మారాయి. పీపీఈ కిట్లు ధరించి చెమటలు పోస్తున్నా గంటల తరబడి ఆసుపత్రుల్లో నర్సమ్మలు సేవలు అందిస్తూ ఎంతో మందికి ప్రాణాలు పోస్తున్నారు. ఇంజెక్షన్లు ఇవ్వడం, ఆక్సిజన్ పెట్టడం, రోగుల పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకొని డాక్టర్లకు చెప్పి మందులివ్వడం.. లాంటి సేవలు ఎంతో కీలకంగా మారాయి. వీటితోపాటు టీకా కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా వందల సంఖ్యలో నర్సులు కొవిడ్ బారిన పడ్డారు. కోలుకున్నాక మళ్లీ ధైర్యంగా విధుల్లో చేరి సేవ కొనసాగిస్తున్నారు.
ప్రజల వెంటే..
మహిళా ప్రజాప్రతినిధులూ ఈ క్రతువులో పాలు పంచుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 800 మంది మహిళా సర్పంచులు తమ గ్రామాల్లో కొవిడ్ కట్టడి కోసం పనిచేస్తున్నారు. కొన్ని చోట్ల స్వయంగా శానిటైజేషన్ చేస్తున్నారు. ఒక మహిళా మంత్రి, ఓ ఎమ్మెల్యే, వరంగల్ నగర మేయర్, జడ్పీ ఛైర్‌పర్సన్లు.. ఇలా వివిధ స్థాయిల్లో మహిళా ప్రజాప్రతినిధులు వైరస్‌ను లెక్కచేయక ప్రజల వెంటే ఉంటున్నారు.
అధికారిణులు ఎందరో..
వరంగల్ రూరల్, జనగామ జిల్లాల కలెక్టర్లు మహిళలే, వరంగల్ మహానగరపాలక సంస్థ కమిషనర్, అర్బన్ డీఎంహెచ్‌వో, పలువురు పోలీసు అధికారిణులు.. ఇలా మహిళలు కరోనా వేళ తమదైన ముద్ర వేస్తున్నారు. వృత్తిలో భాగంగా కొందరు కరోనా బారిన పడ్డా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతున్నారు.