వరంగల్.. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత పెద్దనగరం. ఇప్పుడు ఈ మహానగరాన్నీ వరద కష్టాలు వీడట్లేదు. గత ఏడాది ఆగస్టులో వారం రోజుల పాటు కురిసిన వర్షానికి నగరం పూర్తిగా జలదిగ్భందనమైంది. దీంతో అప్రమత్తమైన అధికారులు నాలాల చుట్టూ ఆక్రమణలు తొలగించారు. ఇక వరంగల్‌కు వరద ముంపు లేదని ధీమాగా ఉన్నారు. రుతుపవనాల ఆరంభంలోనే జోరుగా కురిసిన వర్షాలతో వరంగల్‌లో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి. ఎండాకాలంలోనే నాలాల్లో పూడిక తీపించాల్సిన బల్దియా అధికారులు.. కర్తవ్యాన్ని మరిచిపోవడంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాయి.
పరుగులు పెట్టి.. పూర్తి కాకుండానే వదిలేసి..
జిల్లా కలెక్టర్, నగర మేయర్ ఆదేశాలతో ఉరుకులు పరుగులు పెట్టిన బల్దియా అధికారులు నాలాల్లో పూడిక తీతలు తీసే పని చేపట్టారు. అదీ అసంపూర్తిగానే చేశారు. ఆదివారం మరోసారి వరుణుడి చూపిన ప్రతాపానికి వరంగల్ తడిసి ముద్దైంది. ఏకధాటిగా మూడు గంటల పాటు వర్షం దంచికొట్టింది. దీంతో నగరంలోని రహదారులు ఏరులను తలపించాయి. ఇళ్లల్లోకి దుకాణాల్లోకి నీళ్లు వచ్చి చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు.
ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. ఎవరు రావట్లేదు చూడటానికి, వచ్చినా.. చూస్తారు, పోతారు, ఖతం. ఏం పట్టించుకోవడం లేదు. ఏం చేస్తలేరు. ఇంట్లో వాసనైతే భరించలేకపోతున్నాం. మోరీలో నీళ్లతో ఇంట్లోని రూమ్‌లన్నీ నిండినయ్. ఒక్కరోజు వర్షానికే మా పరిస్థితి ఇట్లున్నది. - స్థానికురాలు
మోరీలు తీయ్యలేదు. పై నుంచి వరదంతా వచ్చేసింది. పోయినసారి వర్షానికి ఇళ్లలోని చాలా వస్తువులు కరాబ్ అయినయ్. మోరీలు నిండితే మున్సిపాలిటి వాళ్లు కూడా మోరీలు ఎక్కువగా తీస్తలేరు. చెత్త అంతా అక్కడే ఉండిపోవడంతో మోరీలు నిండి నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయ్. - స్థానికురాలు
మోకాళ్ల దాకా నీళ్లు, గడ్డి, పాములు తీరుగుతున్నాయి. తెళ్లు, పురుగులు ఉంటున్నాయ్. ఎవరు పట్టించుకునేటోళ్లు లేరు, చూసేటోళ్లు లేరు. మేం పనికి పోతాం. అర్ధరాత్రి వస్తాం. లైట్లు లేవు ఏమీ లేవు. అంతా ఆగం ఉన్నది కథ ఇక్కడ. నది ఎట్లా పారతదో.. గట్లా పారినయ్ నీళ్లన్ని - స్థానికురాలు.
మా ఇళ్లలోకి నీళ్లోస్తే.. మంచాలు తడిసినయ్, ఇరిగినయ్. రెండు క్వింటాళ్ల బియ్యం తడిసినయ్. ఆగమాగం అయినాము. నిన్న కూడా అట్టాగే చూసుకుంటా కుర్చున్నాం. గడపెక్కినయ్ నీళ్లు. కాలువలు లేవు. వాడుకున్న నీళ్లు పోయేటందుకే కాలువలు లేవు. ఈ నీళ్లు ఎట్లా పోతాయ్? - స్థానికురాలు.
ఒక్క వర్షానికే ఇలా అయితే.. ఇంక ముందు ముందు పరిస్థితి ఏంటి? మమ్మల్ని పట్టించుకునేటోళ్లు లేరు ఎవరులేరు. మున్సిపాలిటి వాళ్లకు ఫోన్ చేస్తే వస్తున్నాం పోతున్నాం అంటున్నారు. కాలువ తీసి పోయారు. నీళ్లలో నడిస్తే దురదతో కాళ్లంతా దద్దుర్లు వస్తున్నాయి. - స్థానిక యువకుడు.
ఆదేశించినా.. అధికారులు నిర్లక్ష్యం..
ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మేయర్ గుండు సుధారాణి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి..ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరద ముంపు తప్పేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించినా బల్దియా అధికారులు నిర్లక్ష్యం వీడకపోవడంతో నగరవాసులు తరచూ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కలెక్టర్, మేయర్ ఆదేశించినా తరచూ నాలాల్లో పూడికతీత పనులను పైపైనే చేస్తూ సరిపెట్టేస్తున్నారు. ఫలితంగా వర్షం వచ్చినప్పుడల్లా కాలువలు పొంగిపొర్లి రహదారలపైకి నీరు భారీగా వచ్చి చేరుతోంది.
వర్ష సూచనతో ఆందోళన..
వర్షం వచ్చిన తరువాత హడావుడి చేసే బల్దియా అధికారులు, సిబ్బంది.. కాస్త ముందుగా స్పందిస్తే తమకీ కష్టాలు ఉండవని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అలసత్వం వీడి నాలాల్లో పూర్తిగా పూడిక తీయాలని, డ్రైనేజీల్లో వ్యర్థాలను తొలగించాలని వేడుకుంటున్నారు. రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చూడండి: RAINS: భాగ్యనగరంలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం