దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా వరంగల్ భద్రకాళీ అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇవాళ విజయదశమి సందర్భంగా.. భద్రకాళీ మాత నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం వేదమంత్రోచ్ఛరణల మధ్య.. అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించి అపరాజిత పూజలు నిర్వహించారు.
పండుగ సందర్భంగా పెద్దఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ రాత్రి భద్రకాళీ తటాకంలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. హంస వాహనంపై అమ్మవారి విహారం కనులపండువగా సాగనుంది. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు రాత్రి భద్రకాళీ- భద్రేశ్వరుల కల్యాణంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ సందర్భంగా అమ్మవారికి పుష్పయాగం నిర్వహిస్తారు.
రాజరాజేశ్వరీ దేవీ అలంకరణలో..
హనుమకొండ జిల్లా కేంద్రంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు సుప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయంలో రాజరాజేశ్వరి దేవీ అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. విజయదశమి పర్వదినం సందర్భంగా.. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. కరోనా నిబంధనల మధ్య పూజలు నిర్వహించుకున్నారు.
ఇదీచూడండి: Vijayadashami 2021: నవరాత్రుల వేళ అమ్మవారు ఎక్కడ కొలువై ఉంటుందో తెలుసా..?