Warangal Fort News: చారిత్రక నగరం ఓరుగల్లులో భూ అక్రమణలకు అడ్డు లేకుండా పోతోంది. కాకతీయుల కాలం నాటి చరిత్రకు దర్పణంగా ఉన్న వరంగల్ కోట కబ్జా కోరల్లో చిక్కుకుంటుంది. ఓరుగల్లు కోటకు ఆక్రమణల బీటలు పడుతున్నాయి. పురావస్తు రక్షిత ప్రాంతమైన ఈ కోట స్థలంపై ఓ ప్రజాప్రతినిధి కన్నేసి ఆక్రమించేస్తున్నాడు. వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం విశ్వనాథకాలనీలో మట్టి కోట పక్కన ఉన్న అగడ్త(కందకం)ను ఆయన ఇప్పటికే అర ఎకరం మేరకు పూడ్చి ప్లాట్లుగా మార్చుతున్నాడు. వరంగల్ నగర శివారులో రూ.10 వేలకే గజం స్థలం అంటూ అమ్మేందుకు పన్నాగం పన్నుతున్నాడు. పురావస్తు శాఖ అధికారులు నోటీసులు ఇచ్చినా పట్టించుకోకుండా అగడ్తను బండరాళ్లతో నింపుతూ ఆ స్థలాన్ని చదును చేస్తుండటం గమనార్హం.
నిషేధిత స్థలమైనా.. చర్యలు శూన్యం
వరంగల్ కోటలోని కీర్తి తోరణాలకు సమీపంలో 4 కిలోమీటర్ల మేర రాతి కోట ఉంటుంది. దీని తర్వాత శత్రుదుర్భేద్యమైన మట్టి కోటను 7 కిలోమీటర్ల మేర కాకతీయులు నిర్మించారు. కోటలో నీటి అవసరాల కోసం అగడ్తను తవ్వారు. ప్రస్తుతం నిర్వహణ లేక అది మురుగు కుంటలా మారింది. ఇదే అదనుగా ప్రజాప్రతినిధి అగడ్త స్థలాన్ని విక్రయించి సొమ్ము చేసుకోవడానికి రంగంలోకి దిగాడు. పురావస్తు శాఖ పరిధిలోని కట్టడాలు, రాతి, మట్టి కోటలకు 300 మీటర్ల మేరకు నిషేధిత ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలోని పట్టాభూముల్లోనూ నిర్మాణాలకు అనుమతి ఇవ్వరు. అలాంటి నిషేధిత ప్రాంతంలోని అగడ్తను ప్లాట్లుగా విక్రయించడానికి సిద్ధం చేస్తున్నా.. బాధ్యుడిపై కఠిన చర్యలు తీసుకోకపోవడంపట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పనులు నిలిపేయాలంటూ దాన్ని పూడ్చేస్తున్న వ్యక్తికి నోటీసులు ఇచ్చామని పురావస్తు శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఖిలా వరంగల్ తహసీల్దారు ఫణికుమార్‌ను వివరణ కోరగా.. ఈ ఆక్రమణపై తమకు ఫిర్యాదు వచ్చిన వెంటనే వెళ్లి పనులు నిలిపివేశామని, ట్రాక్టరుతో మట్టిపోసిన వారిపై ఠాణాలో ఫిర్యాదు చేశామని చెప్పారు. పురావస్తు శాఖ నుంచి గెజిట్ తీసుకొని సర్వే చేస్తామని, నివేదిక రాగానే సంబంధీకులపై చర్యలు తీసుకుంటామని వివరించారు.
ఇవీ చదవండి: