రాష్ట్రంలో లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ప్రజలంతా సహకరించి.. ఇళ్లలోనే ఉండాలని సూచించారు. అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడకూడదని చెప్పారు.
మహబూబాబాద్‌కు వైద్య కళాశాల మంజూరు చేయడం పట్ల మంత్రి ఎర్రబెల్లి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అందరికి టీకాలు అందించాలనే గ్లోబల్ టెండర్లకు వెళ్లామని వెల్లడించారు. ప్రస్తుతం 30వేల కొవాగ్జిన్ టీకా డోసులు మాత్రమే ఉన్నాయని.. కొవాగ్జిన్ రెండో డోసు తీసుకోవాల్సిన వారు లక్షల్లో ఉన్నారని తెలిపారు. త్వరలోనే వారంతా టీకాలు తీసుకునే వెసులుబాటు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భాజపా నేతలు కేంద్రంతో మాట్లాడి టీకాలు తెప్పించాలని కోరారు.
ఎంజీఎంలో కొంత టెక్నికల్ సిబ్బంది కొరత ఉందని ఎర్రబెల్లి తెలిపారు. ఈ కొరత తీర్చాలని సీఎం ఆదేశించారని చెప్పారు. సెంట్రల్ జైల్ తరలింపుపై సీఎం మంచి ఆలోచన చేశారని అన్నారు. సెంట్రల్ జైలు వెనుక 23 ఎకరాల ఖాళీ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఎంజీఎంను మాతాశిశు సంరక్షణ కేంద్రంగా మార్చాలని సీఎం సూచించారని పేర్కొన్నారు.